వెలుగు క్రికెట్ టోర్ని: 22ఫిబ్రవరి అప్డేట్స్

వెలుగు క్రికెట్ టోర్ని: 22ఫిబ్రవరి అప్డేట్స్

వెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్ని ఉత్సాహంగా సాగుతుంది. జిల్లా స్థాయిలో మ్యాచ్ లు తుది దశకు చేరుకుంటున్నాయి. ఇవాళ కరీంనగర్-రామగుండం, కొత్తగూడెం-పినపాక జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ లు జరిగాయి. మంచిర్యాల, ఆదిలాబాద్ మధ్య జరిగిన మరో ఫైనల్ మ్యాచ్ లో ఆదిలాబాద్ విజయం సాధించింది.

కరీంనగర్, రామగుండం జట్ల మధ్య జరిగిన జిల్లా స్థాయి ఫైనల్ మ్యాచ్ హోరాహోరిగా సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కరీంనగర్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. తర్వాత 122 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రామగుండం జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే విజయం సాధించింది. 6 బంతుల్లో 28 పరుగులు సాధించి జట్టుకు విజయాన్నందించిన రామగుండం బ్యాట్స్ మెన్ మధు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. విజేతగా నిలిచిన రామగుండం జట్టుకు సీపీ కమలాసన్ రెడ్డి 50 వేలు, రన్నరప్ గా నిలిచిన కరీంనగర్ జట్టుకు 25 వేల నగదు ప్రోత్సాహకం అందించారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు వెలుగు చక్కచి వేదికగా నిలుస్తోందన్నారు కమలాసన్ రెడ్డి.

ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో పినపాక, కొత్తగూడెం జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ను ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ ప్రారంభించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కొత్తగూడెం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పినపాక జట్టు 154 పరుగులు చేసి ఓటమి పాలైంది. విజేతగా నిలిచిన కొత్తగూడెం జట్టుకు 50 వేల రూపాయలు, రన్నరప్ గా నిలిచిన పినపాక జట్టుకు 25 వేల నగదు బహుమతిని అల్లం నారాయణ అందించారు.