వెనెజులాలో టీనేజ్​ తల్లుల గోస

వెనెజులాలో టీనేజ్​ తల్లుల గోస

వెనెజులాలో పట్టుమని పదిహేనేళ్లు కూడా నిండని బాలికలు దిక్కుతోచని పరిస్థితుల్లో బిడ్డల్ని కంటున్నారు. ఆడుతూపాడుతూ చదువుకోవాల్సిన వయసులో చంకలో బిడ్డల్ని ఎత్తుకుని పుస్తకాల బ్యాగుతో స్కూలుకెళుతున్నారు. వారి దుస్థితికి ఆ దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభమే కారణం కావడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చలకు దారితీస్తోంది. ఆర్థిక సంక్షోభం కారణంగా ఆ దేశంలో కరెన్సీ విలువ బాగా పడిపోయింది. దీంతో ఒక చిన్న ప్రెగ్నెన్సీ టెస్టు చేయించుకోవాలంటే 40 వేల బొలివర్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. మన రూపాయల్లో చెప్పుకోవాలంటే ఈ ఖర్చు రూ. 214 మాత్రమే. గర్భనిరోధక మాత్రలు, హార్మోన్ ఇంప్లాంట్లకు సైతం ఆ దేశంలో కరువు ఏర్పడింది. అరకొరగా దొరికినా వాటి రేట్లు మాత్రం ఆకాశానికి అంటేలా ఉంటున్నాయి. దీంతో సరైన గర్భనిరోధక సాధనాలు, వైద్య సౌకర్యాలు లేక టీనేజ్​బాలికలు విధిలేని పరిస్థితుల్లో అయిష్టంగానే ప్రెగ్నెంట్లు అవుతుండటంపై యూఎన్ పాపులేషన్​ఫండ్​సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ సంస్థ​ఇప్పటివరకూ 45 వేల హార్మోన్​ఇంప్లాంట్లను వెనెజులాకు పంపింది. కానీ ఆ దేశంలో 90 లక్షల మంది బాలికలు, మహిళలకు కాంట్రాసెప్టివ్స్ అవసరం ఉందని చెబుతున్నారు.

దేశం విడిచి పారిపోతున్న టీనేజర్లు

వెనెజులాలో 28% మంది 20 ఏండ్లలోపే తల్లులవుతున్నారు. ప్రసవ సమయంలో సమస్యల వల్ల చనిపోతున్న తల్లుల సంఖ్య 2015–16లో 65 శాతానికి పెరిగింది. దేశంలో సరైన ఫెసిలిటీస్ లేకపోవడంతో ప్రెగ్నెంట్​అయిన చాలామంది టీనేజ్ బాలికలు పక్కనే ఉన్న కొలంబియా దేశానికి పారిపోతున్నారు. అలా 2015లోనే 26 వేల మంది వెనెజువన్లు కొలంబియాకు పారిపోయి బిడ్డల్ని కన్నారని అంచనా. అయితే, హ్యుగో చావెజ్ ప్రెసిడెంట్ గా ఉన్న రోజుల్లో వెనెజులా అనేక సంస్కరణలతో దూసుకెళ్లింది. టీనేజ్​లోనే తల్లులవుతున్న బాలికలను ఆయన ‘రెవల్యూషనరీ మదర్స్’గా అభివర్ణించేవారు. పేద, టీనేజ్ తల్లులకు ఆయన నగదు బదిలీ స్కీంలు కూడా పెట్టారు. మరోవైపు ఫ్యామిలీ ప్లానింగ్​కోసం అనేక సౌకర్యాలు కల్పించారు. ఆయన మరణం తర్వాత నికోలస్ మదురో ప్రెసిడెంట్​గా అధికార పగ్గాలు చేపట్టారు. దేశం క్రమంగా ఆర్థిక సంక్షోభంలోకి జారుకోవడంతో చావెజ్​సంస్కరణలను ఆయన ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఒకటి, రెండు డాలర్లకు మించి నగదు కూడా పేద తల్లులకు అందడం లేదు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం వెనెజులాకు ఆపన్నహస్తం అందించాలంటూ యూఎన్​పాపులేషన్​ఫండ్ పిలుపునిచ్చింది.