నా నోబెల్ ప్రైజ్ ట్రంప్‎కు ఇచ్చేశా: అన్నంత పని చేసిన కొరినా మచాడో

నా నోబెల్ ప్రైజ్ ట్రంప్‎కు ఇచ్చేశా: అన్నంత పని చేసిన కొరినా మచాడో

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి అందుకున్నాడు. అదేంటి.. ట్రంప్ నోబెల్ అవార్డ్ అందుకోవడమేంటి అనుకుంటున్నారా..? అవును మీరు చదివింది నిజమే. ట్రంప్ నోబెల్ ప్రైజ్ అందుకున్నాడు. కానీ అది నోబెల్ కమిటీ నుంచి కాదు. నోబెల్ అవార్డ్ విన్నర్ నుంచి. 2025 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కొరినా మచాడో తన నోబెల్ అవార్డును ట్రంప్‎కు అందజేశారు.

వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో 2025 నోబెల్ శాంతి బహుమతిని గెల్చుకున్న విషయం తెలిసిందే. ఈ అవార్డును ఆమె అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‎కు అంకితం చేశారు. తన అవార్డును ట్రంప్‎కు అందజేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురువారం (జనవరి 15) అమెరికాలో పర్యటించిన మచాడో వైట్ హౌస్‎లో ట్రంప్‎తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన నోబెల్ అవార్డును మచాడో ట్రంప్‎కు అందజేశారు. 

Also Read : ఒకే వారంలో మూడు సార్లు

ఈ మీటింగ్ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ట్రంప్‎కు తన నోబెల్ శాంతి బహుమతి పతకాన్ని బహూకరించానని తెలిపారు. వెనిజులా ప్రజల స్వేచ్ఛ కోసం ఆయన ప్రత్యేక నిబద్ధతకు గుర్తింపుగా అవార్డును అందజేసినట్లు పేర్కొన్నారు. భేటీలో వెనెజువెలా భవిష్యత్తు గురించి ఆయనతో చర్చించానని తెలిపారు. వెనిజులా ప్రజలు స్వేచ్ఛ కోసం అమెరికా అధ్యక్షుడిపై ఆధారపడొచ్చని అన్నారు. ట్రంప్ తో భేటీ చాలా అద్భుతంగా జరిగిందన్నారు. కాగా, 2024 నుంచి అజ్ఞాతంలో ఉన్న మచాడో తొలిసారి బహిరంగంగా కనిపించారు. మరోవైపు.. ట్రంప్ నోబెల్ పతకాన్ని అంగీకరిస్తున్నారా లేదా అని వైట్ హౌస్ వెల్లడించలేదు.