మాదాపూర్, వెలుగు: సంగీతాన్ని జీవితంలో భాగం చేసుకుంటే మనసుకు ప్రశాంతత లభిస్తుందని, తల్లిదండ్రులు తమ పిల్లలకు భారతీయ కళలు నేర్పించి మూలాలను మర్చిపోకుండా చూడాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. మాదాపూర్ శిల్పకళావేదికలో శనివారం జరిగిన ‘ఆరభి ది సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ 28వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కళారత్న డాక్టర్ అశోక్ గుర్జాలే సంగీత దర్శకత్వంలో 150 మంది కళాకారులతో నిర్వహించిన ‘గ్రాండ్ వయోలిన్ సింఫనీ’ ఆకట్టుకుంది. గంటన్నర పాటు సాగిన ఈ కచేరీపై వెంకయ్య ప్రశంసలు కురిపించారు. కీర్తనలు వింటున్నప్పుడు తాను భావోద్వేగానికి గురయ్యానని, కళ్లలో ఆనంద బాష్పాలు జాలువారాయన్నారు. కార్యక్రమంలో పద్మశ్రీ యెల్లా వెంకటేశ్వరరావు, ఐఏఎస్ అధికారి స్నేహ శబరీష్, పద్మశ్రీ దీపికారెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
