తెలుగు భాష కంటి చూపు అయితే, ఇంగ్లిష్ కండ్ల జోడు లాంటిది

తెలుగు భాష కంటి చూపు అయితే,  ఇంగ్లిష్ కండ్ల జోడు లాంటిది
  • మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్య
  • ఢిల్లీలో బ్రహ్మానందం ఆత్మకథ పుస్తకం ఆవిష్కరణ 

న్యూఢిల్లీ, వెలుగు: 30 ఏండ్ల సినీ ప్రస్థానంలో వెయ్యికి పైగా చిత్రాల్లో నటించిన హాస్యరాజు బ్రహ్మానందం అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మిమిక్రీ షో ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టిన బ్రహ్మానందం.. సినీ రంగంలో శిఖరాగ్ర స్థానం చేరుకున్నారని కొనియాడారు. యావత్‌‌ ప్రజానికాన్ని తన హాస్యంతో ఇప్పటికీ నవ్విస్తున్న ఆయన.. కోట్లాది మందికి స్ఫూరిదాయకమని పేర్కొన్నారు. ఇన్నేండ్ల సినీ ప్రయాణంలో ఎలాంటి హింస, అసభ్యత లేకుండా నటించిన ఏకైక నటుడు బ్రహ్మానందం అని అభినందించారు. బ్రహ్మానందం ఆత్మకథ “మీ అండ్ నేను”అనే పుస్తకాన్ని శుక్రవారం ఢిల్లీలోని ఆఫీసర్స్‌‌ క్లబ్‌‌లో వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. 

ఈ బుక్‌‌ను ఇప్పటికే తెలుగు, ఇంగ్లీష్‌‌, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ప్రచురించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ఈ ఆత్మకథ దేశవ్యాప్తంగా పాఠకులకు స్ఫూర్తిదాయకమన్నారు. బ్రహ్మానందం నటనలో నిబద్ధతని, పద్ధతులను పాటించిన వ్యక్తి అని అన్నారు. బ్రహ్మానందం డైలాగులు అత్యంత ఆనందాన్ని ఇస్తాయని, అందుకే ఆయన ‘ఆనందో బ్రహ్మి’అని కొనియాడారు. తాను పదవి విరమణ చేశాను కానీ, పెదవి విరమణ చేయలేదని వెంకయ్యనాయుడు చమత్కరించారు. 

చిన్ననాటి రోజుల్లో హిందీపై మమకారం ఉండేది కాదని, రాజకీయాల్లో భాగంగా ఢిల్లీకి వచ్చాక ఆ భాష వాల్యూ తెలిసిందన్నారు. హిందీ నేర్చుకోవడం అవసరమని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో హిందీ ఎంత అవసరమో.. ప్రపంచంలో రాణించాలంటే ఇంగ్లిష్ అంత అవసరమన్నారు. తెలుగు కంటిచూపు లాంటిది అయితే.. ఇంగ్లిష్ కండ్లజోడు లాంటిదని పేర్కొన్నారు. 

కష్టపడితే విజయం: బ్రహ్మానందం

బురద నుంచి కమలం పుడుతుందని, కష్టపడి పనిచేస్తేనే విజయం వరిస్తుందని బ్రహ్మానందం అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌‌‌‌, అబ్దుల్ కలాం, ప్రధాని మోదీ లాంటి వాళ్లు తన ఆత్మకథను రాసేందుకు స్ఫూర్తి అని అన్నారు. నటరాజ ఆశీర్వాదంతో 1,200 సినిమాల్లో నటించానన్నారు. ‘‘నా జీవితం గురించి మాత్రమే పుస్తకంలో రాశాను. 40 ఏండ్లుగా ఏదో శక్తి నన్ను నడిపిస్తుందని నమ్ముతాను. అక్కినేని నాగేశ్వర్‌‌‌‌రావు నుంచి అఖిల్‌‌ వరకు, చిరంజీవి నుంచి రాంచరణ్‌‌ వరకు అందరితో కలసి యాక్ట్‌‌ చేయడం గర్వంగా ఉంది’’అని ఆయన చెప్పారు. రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన తనకు లేదని ఆయన స్పష్టం చేశారు.