మీడియాకు దేశం పట్ల మక్కువ ఉండాలె : వెంకయ్య నాయుడు

మీడియాకు దేశం పట్ల మక్కువ ఉండాలె : వెంకయ్య నాయుడు

న్యూఢిల్లీ, వెలుగు: మీడియా ఎప్పుడూ న్యూట్రల్​గానే వ్యవహరించాలని, లెఫ్ట్, రైట్ ​కాకుండా సూటిగా ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మీడియా సంస్థలపై తనకు ఉన్న అభిప్రాయాలు చాలా సరళమైనవని పేర్కొన్న ఆయన.. మీడియాకు దేశం పట్ల మక్కువ ఉండాలని సూచించారు. ఏ కమీషన్ ఆశించకుండా, తప్పిదాలు లేకుండా ఒక మిషన్‌‌‌‌‌‌‌‌గా న్యూస్​ను ప్రసారం చేయడమే అభిరుచిగా ఉండాలని వెంకయ్య ఆకాంక్షించారు. న్యూస్ బ్రాడ్​కాస్టర్స్ ఫెడరేషన్(ఎన్ బీఎఫ్), టాప్ పాన్ ఇండియా టీవీ న్యూస్ సంస్థలు, డిజిటల్ పబ్లిషర్లు కలిసి ‘ఫ్యూచర్ ఆఫ్ న్యూస్’ థీమ్ తో శుక్రవారం ఢిల్లీలో జాతీయ సదస్సు(నేషనల్ కాంక్లేవ్) నిర్వహించాయి. ఎన్​బీఎఫ్​ ప్రెసిడెంట్ అర్నాబ్ గోస్వామి, వైస్ ప్రెసిడెంట్ శంకర్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ ​జరిగింది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. న్యూస్ అండ్ వ్యూస్ వేర్వేరుగా ఉండాలని ఆయన సూచించారు.  వార్తలు సత్యానికి దగ్గరగా, సంచలనానికి దూరంగా ఉండాలన్నారు. ‘మాతృభాష కంటి చూపు లాంటిది. ఇంగ్లీషు వంటి ఇతర భాషలు కళ్లద్దాలు. కంటి చూపు ఉంటే కళ్లద్దాలు పని చేస్తాయి. కానీ కంటి చూపే లేకుంటే ఎలా చూడగలం’ అని చెప్పుకొచ్చారు. ఎన్బీఎఫ్ లోని ప్రాంతీయ వార్తా చానెళ్ల ప్రదర్శనను ఆయన ప్రశంసించారు. ఈ ధోరణిని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వెంకయ్య పేర్కొన్నారు.  

మీడియా సమస్యలపై చర్చ

ఈ ప్లాట్​ఫామ్ ద్వారా ప్రాంతీయ మీడియాలో ఉన్న అనేక సమస్యలు తగ్గుతాయని ఎన్బీఎఫ్ ఉపాధ్యక్షుడు శంకర్ అన్నారు. రెండేళ్ల క్రితమే సంస్థను నెలకొల్పినప్పటికీ దేశంలో వీ6 న్యూస్, వెలుగు సహా దాదాపు 40కి పైగా చానల్స్,150కి పైగా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లు ఇందులో భాగస్వామ్యం కావడం గొప్ప విషయం అన్నారు. ఎన్బీసీ ఫస్ట్ ఎడిషన్ విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ సదస్సు ద్వారా రీజినల్ మీడియాలో ఉన్న సమస్యలపై చర్చించే ఆస్కారం లభించిందన్నారు. ఈ వేదిక బ్రాడ్​కాస్టింగ్ పరిశ్రమకు కొత్త దశ, దిశను నిర్దేశించిందని ఎన్బీఎఫ్ పార్ట్​నర్ భరత్ అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయి ప్రజాప్రతినిధులు, జాతీయ, ప్రాంతీయ న్యూస్ చానెల్స్ కు చెందిన ప్రముఖ జర్నలిస్టులు, కార్పొరేట్ లీడర్లు, ఎక్స్ పర్ట్ లు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన న్యూస్ మీడియా ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలు, మీడియా రంగ భవిష్యత్తుపై చర్చించారు.