గాంధీలో వెంటిలేటర్ బెడ్లు ఫుల్

గాంధీలో వెంటిలేటర్ బెడ్లు ఫుల్
  • పెద్ద దవాఖాన్లన్నింటిలోనూ ఇదే పరిస్థితి
  • చిన్న దవాఖాన్ల నుంచి వెంటిలేటర్లను షిఫ్ట్ చేస్తున్న సర్కార్
  • కొత్తగా 5567 మందికి పాజిటివ్
  • ఒక్క రోజే కరోనాతో 23 మంది మృతి

హైదరాబాద్, వెలుగు: గాంధీ హాస్పిటల్‌‌లో వెంటిలేటర్ బెడ్లన్నీ నిండిపోయాయి. 619 వెంటిలేటర్లు ఉంటే అందులో ఒక్కటి కూడా ఖాళీ లేదు. అందులో ఎవరైనా కోలుకుంటేనో, మరణిస్తేనో తప్ప ఇంకొకరికి వెంటిలేటర్‌‌‌‌ దొరికే పరిస్థితి లేదు. టిమ్స్‌‌, కింగ్ కోఠి, చెస్ట్ హాస్పిటల్ సహా పెద్ద దవాఖాన్లలోనూ ఇదే పరిస్థితి ఉంది. దీంతో చిన్న హాస్పిటళ్లలోని వెంటిలేటర్లను పెద్ద దవాఖాన్లకు తరలిస్తున్నారు. బుధవారం ఇలా వంద వెంటిలేటర్లను తరలించారు. గురువారానికి అవి కూడా నిండుకున్నాయి. ప్రస్తతుం ప్రభుత్వ దవాఖాన్లలో 858 వెంటిలేటర్లు ఖాళీగా ఉన్నాయి. వీటిలో సగం వరకు చిన్న హాస్పిటళ్లలో ఉండగా, పేషెంట్లు ఎక్కువగా వస్తున్న పెద్ద దవాఖాన్లకు వాటిని షిఫ్ట్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. కార్పొరేట్‌‌, మల్టీ స్పెషాలిటీ, స్పెషాలిటీ హాస్పిటళ్లలోనూ ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు ఫుల్ అయ్యాయి. చిన్న హాస్పిటళ్లలో మాత్రమే ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో పేషెంట్లకు సీరియస్ కాగానే, మేనేజ్ చేయలేక పెద్ద దవాఖాన్లకు రిఫర్ చేస్తున్నారు. ఇలా సీరియస్‌‌ కండిషన్‌‌లో ఉన్న పేషెంట్లు వెంటిలేటర్ బెడ్లు దొరక్క అంబులెన్సుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. సీరియస్ పేషెంట్లను చివరిదాకా  బతికించేందుకు ప్రయత్నం చేయాలని హాస్పిటళ్ల యాజమాన్యాలకు మంత్రి ఈటల రాజేందర్ సూచించారు.

వెబ్‌‌సైట్‌‌లో ఫోన్ నంబర్లు
కరోనా పేషెంట్లు బెడ్ల కోసం ఎంక్వైరీ చేసేందుకు ప్రతి హాస్పిటల్‌‌కు ఒక ఫోన్ నంబర్‌‌‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. హెల్త్ డిపార్ట్‌‌మెంట్ వెబ్‌‌సైట్‌‌ ( https://health.telangana.gov.in/ )లో ఉన్న లైవ్ డ్యాష్ బోర్డులో హాస్పిటళ్ల వారీగా ఫోన్ నంబర్లను అప్‌‌డేట్ చేశారు. కరోనా పేషెంట్లు హాస్పిటళ్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ఆయా హాస్పిటళ్లకు ఫోన్ చేసి ముందే బెడ్ల వివరాలు తెలుసుకోవచ్చని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. 

ఒక్క రోజులోనే 23 మంది మృతి
రాష్ర్టంలో ఒక్క రోజే కరోనాతో 23 మంది చనిపోయినట్టు హెల్త్ డిపార్ట్​మెంట్ గురువారం ప్రకటించింది. మొత్తం మృతుల సంఖ్య 1,899కి చేరినట్టు పేర్కొంది. 1,02,335 మందికి టెస్టులు చేస్తే.. 5,567 మందికి పాజిటివ్ వచ్చిందని బులెటిన్‌‌లో పేర్కొన్నారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్‌‌లో 989, జిల్లాల్లో 4,578 కేసులు నమోదైనట్టు చూపించారు. వీటితో కలిపి మొత్తం కేసులు 3,73,468కి చేరాయి. ఇప్పటి వరకు 3,21,788 మంది కోలుకోగా  17 వేల మంది హాస్పిటళ్లలో చికిత్స పొందుతుండగా, మిగిలినవాళ్లు హోమ్‌‌ ఐసోలేషన్‌‌లో ఉన్నారు.