ఇప్పటికే ఇద్దరు భార్యలు.. మరొకరితో సంబంధం

ఇప్పటికే ఇద్దరు భార్యలు.. మరొకరితో సంబంధం
  • వేణు మిస్సింగ్​ కేసును ఛేదించిన పోలీసులు

హనుమకొండ, కాజీపేట, వెలుగు : హనుమకొండ జిల్లాలో రెండున్నర నెలల కింద అదృశ్యమైన వ్యక్తి కేసును పోలీసులు ఛేదించారు. ఇప్పటికే ఇద్దరు భార్యలుండగా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను మొదటి భార్యే సుపారీ ఇచ్చి హత్య చేయించింది. శవాన్ని మాయం చేయించి అదృశ్యమయ్యాడని నమ్మించే ప్రయత్నం చేసింది. ఆ వివరాలను వరంగల్ సెంట్రల్​జోన్​డీసీపీ, ఏసీపీ శ్రీనివాస్​ఆదివారం కాజీపేట పీఎస్​లో వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా ఇందిరానగర్​ కు చెందిన జన్నారపు వేణు కుమార్(34) కి ఇద్దరు భార్యలు. మొదటి భార్య సుష్మిత కాజీపేటలోని రైల్వే లోకో షెడ్​లో టెక్నీషియన్ . దీంతో సుస్మిత, వేణు, ఇతడి రెండో భార్య సంతోష, పిల్లలంతా కలిసి డీజిల్ కాలనీలోని సుస్మిత రైల్వే క్వార్టర్స్​లోనే ఉంటున్నారు. వేణు కొన్నేండ్లుగా కాజీపేటలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. కొన్ని నెలల నుంచి మహబూబాబాద్​కు చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో వేణుకు, ఇద్దరు భార్యలకు మధ్య గొడవలు మొదలయ్యాయి. 

రూ. 4 లక్షలకు సుపారీ

భర్త ప్రవర్తనతో విసుగు చెందిన మొదటి భార్య సుస్మిత ఎలాగైనా భర్తను చంపాలని నిర్ణయించుకుంది. తన దగ్గరి బంధువు వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన కొంగర అనిల్ కి విషయం చెప్పింది. దీంతో అనిల్ తనకు పరిచయమున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేటకు చెందిన (ప్రస్తుత నివాసం హనుమకొండ, వడ్డేపల్లి ) గడ్డం రత్నాకర్, అదే గ్రామానికి చెందిన కారు డ్రైవర్ కటిక నవీన్​లను సుస్మితకు పరిచయం చేశాడు. దీంతో వేణు కుమార్​ను చంపేందుకు సుస్మిత వారితో రూ.4 లక్షలకు ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా కొద్దిరోజుల కింద సుస్మిత అడ్వాన్స్ కింద రూ.2లక్షలు కూడా చెల్లించింది.

అపస్మారక స్థితిలో ఉండగానే వాగులో పడేసిన్రు..

వేణు హత్యకు ప్లాన్​ రెడీ చేసిన సుస్మిత ఈ ఏడాది సెప్టెంబర్ 30న రాత్రి సేమియా చేసింది. అందులో నిద్రమాత్రలు కలిపి భర్తతో తాగించింది. అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లగానే అనిల్​కు ఫోన్​ చేసి చెప్పింది. కొద్దిసేపటికే అనిల్, రత్నాకర్ ఇద్దరూ అక్కడకు వచ్చి స్పృహలో లేని వేణుని కారులో పరకాల వైపు తీసుకెళ్లారు. పరకాలలో నవీన్ ను కారు ఎక్కించుకుని ముగ్గురూ కలిసి అదే రోజు అర్ధరాత్రి పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోని మానేరు వాగు వద్దకు చేరుకున్నారు. అక్కడ  నిర్మానుష్య ప్రదేశంలో కారు ఆపి.. అపస్మారక స్థితిలో ఉన్న వేణుని నీళ్లలో పడేశారు. చనిపోయి ఉంటాడని నిర్ధారించుకుని ఇండ్లకు చేరుకున్నారు. 

సుస్మిత తీరుపై అనుమానంతో...

తనపై ఎవరికీ అనుమానం రావద్దనే ఉద్దేశంతో సుస్మిత అక్టోబర్ 7న కాజీపేట పోలీస్ స్టేషన్​కు వచ్చి భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. విచారణలో సుస్మిత పొంతన లేని విషయాలు చెబుతుండటంతో ఆమెపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమె కాల్ డేటాను పరిశీలించగా కొందరితో ఎక్కువగా ఫోన్లు మాట్లాడుతున్నట్టు గ్రహించారు. దీంతో సుస్మిత తో పాటు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయాన్ని ఒప్పుకున్నారు. వేణుని వాగులో పడేసిన ప్రదేశాన్ని చూపించగా వెతికారు. అంతకుముందే అక్టోబర్ 3న గుర్తు తెలియని మృతదేహం స్థానిక పోలీసులకు దొరకడంతో ఫోరెన్సిక్, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి ఆ మృతదేహం వేణుదేనని తేల్చారు. నిందితుల్లో గడ్డం రత్నాకర్ మీద భూపాలపల్లి జిల్లాలో రెండు మర్డర్ కేసులు, ఒక అటెంప్ట్​ మర్డర్​ కేస్​, రౌడీ షీట్ ఉంది. కేసును చాకచక్యంగా ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్న కాజీపేట సీఐ మహేందర్ రెడ్డి, అతని టీంను డీసీపీ, ఏసీపీ అభినందించారు.