
-
10 రోజులు వాదనలు విన్న రాజ్యాంగ ధర్మాసనం
న్యూఢిల్లీ: బిల్లుల విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధింపు కేసులో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించి పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించవచ్చా? అనే అంశంపై సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది.
చీఫ్‌జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 10 రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఈ అంశంపై కేంద్రంతో పాటు రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకున్న కోర్టు.. అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ అడ్వొకేట్లు కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వీ, గోపాల్ సుబ్రమణియమ్ తదితరుల వాదనలు విన్నది. ఈ కేసులో అన్ని వర్గాల వాదనలు పూర్తి కావడంతో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు గురువారం తెలిపింది.
చివరి రోజు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టు గడువు విధించలేదని, వాళ్ల విచక్షణాధికారాల్లో జోక్యం చేసుకోవద్దని అన్నారు. ఈ క్రమంలో సీజేఐ స్పందిస్తూ.. ‘‘ఎవరైనా సరే రాజ్యాంగ సంరక్షకుడిగా ఉండాలి. అధికారాల విభజన సిద్ధాంతాన్ని నేను బలంగా నమ్ముతాను. జ్యుడీషియల్ యాక్టివిజం కాస్త జ్యుడీషియల్ టెర్రరిజంగా మారొద్దు. ప్రజాస్వామ్యంలోని ఒక విభాగం తన విధులు నిర్వర్తించడంలో విఫలమైతే రాజ్యాంగ సంరక్షకుడిగా ఉండే కోర్టు.. చూస్తూ కూర్చోవాలా?” అని ప్రశ్నించారు.
క్రిమినల్ అప్పీల్స్ పెండింగ్..
హైకోర్టుల్లో పెద్ద సంఖ్యలో క్రిమినల్ అప్పీల్స్ పెండింగ్‌లో ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ఓ కేసులో ఆరుగురు దోషులకు పడిన మూడేండ్ల శిక్షను రద్దు చేస్తూ ఈ కామెంట్ చేసింది. కింది కోర్టు విధించే శిక్షను సవాల్ చేస్తూ దోషులు హైకోర్టులో అప్పీల్ చేస్తే, ఆ శిక్ష పూర్తయినా వాటిపై విచారణ జరగడం లేదని పేర్కొంది.
అది మ్యాచ్.. జరగనివ్వండి
భారత్, పాక్ మధ్య ఆదివారం జరగనున్న క్రికెట్ మ్యాచ్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన లా స్టూడెంట్లపై సుప్రీంకోర్టు ఫైర్ అయింది. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్లు కోరగా.. ‘‘ఇందులో అత్యవసరం ఏముంది? అది కేవలం ఒక మ్యాచ్.. జరగనివ్వండి. ఆదివారం మ్యాచ్ ఉంది.. ఏం చేయమంటారు?” అని ప్రశ్నించింది.