హైదరాబాద్ సిటీ, వెలుగు: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ హిందుత్వాన్ని అవమానించేలా మాట్లాడిన ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ధర్మాచార్య ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి కోరారు. మంగళవారం వీహెచ్‌పీ ప్రతినిధులతో కలిసి డీజీపీ శివధర్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు సమాజంలో శాంతి, సామరస్యాలను కాపాడాల్సిన బాధ్యతను మర్చిపోతున్నారన్నారు.
ఎమ్మెల్యే సామేల్ చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని కించపరిచేలా, కులాల మధ్య విభేదాలు రగిలించేలా ఉన్నాయని మండిపడ్డారు. ఎస్సీ కులానికి చెందిన సర్టిఫికెట్‌ను ఉపయోగించుకుంటూ క్రైస్తవ జీవన విధానాన్ని అనుసరిస్తున్న వ్యక్తి రిజర్వేషన్ ప్రయోజనాలను పొందడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఈ అంశంపై కూడా ప్రభుత్వం, సంబంధిత అధికారులు సమగ్రంగా విచారించాలని కోరారు. సమాజంలో విభేదాలు సృష్టించేలా వ్యవహరిస్తున్న సామేల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
