న్యూఢిల్లీ, వెలుగు: ముందస్తు సమాచారం లేకుండా మాదాపూర్ సున్నం చెరువు ప్రాంతంలోని దాదాపు 200 గుడిసెలను హైడ్రా తొలగించిందని ఆరోపిస్తూ బాధితులు నేషనల్ హ్యుమన్ రైట్స్ కమిషన్ (ఎన్ హెచ్ఆర్సీ)ని ఆశ్రయించారు. మానవహక్కుల ఉల్లంఘన జరిగిన ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని, తమకు న్యాయం చేయాలని కోరారు.
ఈ నెల 10న బాధితులు ఎన్ హెచ్ఆర్సీకి ఈ–కంప్లయింట్ చేయగా, కమిషన్స్వీకరించింది. దాదాపు 15 ఏండ్లుగా సున్నం చెరువు సమీపంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పేద కూలీలైన తాము గుడిసెలు వేసుకొని జీవిస్తున్నాయని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా గత ఆదివారం పోలీసుల భారీ భద్రత నడుమ హైడ్రా అధికారులు.. తమ గుడిసెలు కూల్చారని అందులో పేర్కొ న్నారు. కూల్చివేతల సమయంలో అడ్డుకున్న వారిపై పోలీసులు దాడి చేశారని, ఆ తర్వాత తమపైనే కేసులు నమోదు చేశారని తెలిపారు.