
నాగ్‌పూర్ / అహ్మదాబాద్: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న విదర్భ.. రంజీ ట్రోఫీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బౌలింగ్‌లో హర్ష్ దూబే (5/127) చెలరేగడంతో.. శుక్రవారం జరిగిన సెమీస్‌లో విదర్భ 80 రన్స్ తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబైని చిత్తు చేసింది. 406 రన్స్ ఛేజింగ్‌లో 83/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు ఆట కొనసాగించిన ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 325 రన్స్‌కు ఆలౌటైంది. శార్దూల్ ఠాకూర్ (66),శామ్స్ ములానీ (46), ఆకాశ్ (39), అవాస్తి (34), రాణించినా ప్రయోజనం దక్కలేదు. సూర్యకుమార్ (23), శివం దూబే (12) నిరాశపర్చారు.
ఫిఫ్టీ, సెంచరీతో రాణించిన యష్ రాథోడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇక గుజరాత్, కేరళ మధ్య జరిగిన సెమీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో 2 రన్స్ ఆధిక్యంతో కేరళ (457) టైటిల్ ఫైట్‌కు అర్హత సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 429/7 తో ఆట కొనసాగించిన గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 174.7 ఓవర్లలో 455 రన్స్‌కు ఆలౌటైంది. సిద్ధార్థ్ దేశాయ్ (30) కాసేపు పోరాడాడు.
కేరళ తొలి ఇన్నింగ్స్ స్కోరును దాటేందుకు మరో మూడు రన్స్ అవసరమైన దశలో గుజరాత్ చివరి బ్యాటర్ అర్జాన్ (10) ఆదిత్య సర్వాటే బౌలింగ్‌లో షాట్ కొట్టగా.. అది షార్ట్ లెగ్ ఫీల్డర్ హెల్మెట్‌కు తగిలి స్లిప్‌లో సచిన్ బేబీ చేతిలో పడింది. దాంతో గుజరాత్‌కు నిరాశ తప్పలేదు. జలజ్ సక్సేనా, సర్వాటే చెరో నాలుగు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కేరళ మ్యాచ్ చివరకు రెండో ఇన్నింగ్స్‌లో 114/4 స్కోరు చేసింది. మహ్మద్ అజారుద్దీన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. కేరళ, విదర్భ మధ్య ఫైనల్ బుధవారం నుంచి నాగ్‌పూర్‌లో జరుగుతుంది.