అటల్ సేతుపై మొదటి రోడ్డు ప్రమాదం.. డివైడర్ ను ఢీకొన్న మారుతీ కారు

అటల్ సేతుపై మొదటి రోడ్డు ప్రమాదం.. డివైడర్ ను ఢీకొన్న మారుతీ కారు

భారతదేశంలోని అతి పొడవైన సముద్ర వంతెన అయిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (అటల్ సేతు) పై కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మారుతీ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరు చిర్లే నుంచి ముంబైకి వెళ్తున్నారు. నవీ ముంబైలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ట్రాన్స్ హార్బర్ లింక్ లేదా అటల్ సేతుగా పిలుచుకునే ఈ వంతనపై జరిగిన మొదటి ప్రమాదం ఇదే. జనవరి 12న దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులతో వెళ్తున్న మారుతీ కారు అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడటంతో ఈ ఘటన చోటుచేసుకుందని ముంబై పోలీసులు తెలిపారు. కారు నడుపుతున్న మహిళకు స్వల్ప గాయాలు కాగా, కారు పైకప్పు, విండ్‌షీల్డ్ దెబ్బతిన్నదని చెప్పారు. ఐదు నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలతో సహా వాహనంలో ఉన్న మరో నలుగురు వ్యక్తులు క్షేమంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన అంతా కూడా కెమెరాకు చిక్కింది.

ట్రాఫిక్ పోలీసుల సహాయంతో, గాయపడిన మహిళను నవీ ముంబైలోని ఆసుపత్రికి తరలించారు. అయితే కుటుంబ సభ్యులు ఆమెను డిశ్చార్జ్ చేసి ముంబైకి తీసుకెళ్లారు. ఇక ఈ వంతెన ఆరు లేన్లతో 21.8 కి.మీ పొడవును కలిగి ఉంది. రూ.18వేల కోట్లతో దీన్ని నిర్మించారు. ఇది ముంబైలోని సెవ్రి నుండి ఉద్భవించింది. రాయ్‌గఢ్ జిల్లాలోని ఉరాన్ తాలూకాలోని నవా షెవా వద్ద ముగుస్తుంది.