హాజీపూర్: బీహార్లోని వైశాలి జిల్లా హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. భార్య చదువు, ఉద్యోగం కోసం అహర్నిశలు శ్రమించి.. ఉన్న పొలం అమ్మి భర్త చదివిస్తే.. ప్రభుత్వ ఉద్యోగం రాగానే సదరు భార్య తాళిని ఎగతాళి చేసి భర్త, పదేళ్ల కొడుకును వదిలేసి మరొకరితో వెళ్లిపోయింది. దీంతో.. తన భార్యను నిలదీసేందుకు వెళ్లిన భర్తకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లగా.. తన ప్రియుడితో కలిసి భార్య చనువుగా ఉన్న దృశ్యం చూసి భర్త గుండె బద్ధలైంది.
ఇలాంటి ఒక దృశ్యం చూడటానికా.. తాను ఇంత కష్టపడి భార్యను చదివించి.. ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం రావాలని కోరుకుందని బాధతో భర్త గుండె బరువెక్కింది. భార్య, ఆమె ప్రియుడికి తెలియకుండా.. ఇద్దరినీ ఇంట్లో ఏకాంతంలో ఉన్న సమయంలో.. తలుపులకు తాళం వేసి పోలీసులకు ఫోన్ చేశాడు. భార్య, ప్రియుడిని పోలీసులు విచారించారు. ఈ క్రమంలో.. భర్తతో ఈ భార్య గొడవ పడిన వీడియో నెట్టింట వైరల్ అయింది. తప్పు చేయడమే కాకుండా.. భర్తపై విరుచుకుపడుతుందని అతని భార్యపై నెటిజన్లు మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బిదుపూర్కు చెందిన అమన్ కుమార్, గుంజన్ కుమారి 2013లో పెళ్లి చేసుకున్నారు. 2013లో ఈ జంట పెళ్లి చేసుకున్న సమయానికి.. గుంజన్ ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. కానీ.. ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని ఆమె కోరుకుంది.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ భార్య కలను నెరవేర్చేందుకు అమన్ కుమార్ ముందుకొచ్చాడు. ఆమెను డిగ్రీ, బీఎడ్ చదివించడానికి.. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బిపిఎస్‌సి) ఉపాధ్యాయ నియామక పరీక్షకు సన్నద్ధం కావడానికి అవసరమైన డబ్బును ల్యాండ్ అమ్మి మరీ సమకూర్చాడు. గుంజన్ కూడా కష్టపడి చదువుకుని BPSC TRE-02 పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. 6 నుంచి 8 తరగతులకు ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఆమెకు పోస్టింగ్ వచ్చింది. ఆమె సుపాల్ జిల్లాలోని త్రివేణిగంజ్‌లో ట్రైనింగ్ తీసుకుంది. ఆ తర్వాత వైశాలి జిల్లా, బిదుపూర్ బ్లాక్‌లోని యుఎంఎస్ మోహన్‌పూర్ ధరంపూర్ పాఠశాలకు బదిలీ అయింది. ఈ ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో గుంజన్కు తన కాలేజీ స్నేహితుడైన ప్రేమ్ ప్రకాష్ జైస్వాల్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా సంబంధానికి దారితీసింది. విషయం గుంజన్ భర్తకు తెలిసింది. ఈ క్రమంలో.. భర్త, పదేళ్ల కొడుకును వదిలేసి గుంజన్ ఒక అద్దె ఇంట్లో తన ప్రియుడితో కలిసి ఉంటోంది.
మే 25వ తేదీన.. గుంజన్ తన ప్రియుడితో కలిసి ఇంట్లో ఉన్నట్లు ఆమె భర్త అమన్ కుమార్కు తెలిసింది. ఇంట్లో ఇద్దరినీ చూసిన అమన్ ఇంటికి తాళం వేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు భార్య, భర్త, ఆమె ప్రియుడితో మాట్లాడారు. ఈ సమయంలో భర్తతో గుంజన్ గొడవ పెట్టుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.
