పార్లమెంట్ లో రచ్చ రచ్చ : బీభత్సంగా కొట్టుకున్న ఎంపీలు

పార్లమెంట్ లో రచ్చ రచ్చ : బీభత్సంగా కొట్టుకున్న ఎంపీలు

తాము ప్రజాప్రతినిధులమన్న విషయమే మర్చిపోయి కొట్లాడకు సిద్ధమయ్యారు. చట్టసభలోనే వీధి రౌడీల్లా ప్రవర్తించారు ఆ దేశ ఎంపీలు. ఇప్పుడు ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మాల్దీవుల్లో జనవరి 28న చోటుచేసుకున్న ఈ ఘటన పార్లమెంటులో రణరంగాన్ని తలపించింది. వివరాల్లోకి వెళితే..

మాల్దీవుల క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయంపై పార్లమెంటులో ఓటింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో అధికార పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్, విపక్ష ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవుల ఎంపీల మధ్య మొదలైన వాగ్వాదం చివరకు పెను ఘర్షణకు దారితీసింది. సభలో గందరగోళం సృష్టించిన కొందరు ఎంపీలు.. పోడియం పైకి వెళ్లి స్పీకర్‌ కార్యకలాపాలను అడ్డుకున్నారు. మరికొందరు స్పీకర్‌ తో సహా అక్కడున్న వారితో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా ఓ ఎంపీ స్పీకర్ చెవి దగ్గర ట్రంపెట్ లాంటి స్పీకర్ ను నోటితో ఊదుతూ ఆయన్ను ఇబ్బంది పెట్టారు.

ఈ క్రమంలో పలువురు బెంచీల పైనుంచి వెళ్లి.. స్పీకర్‌ను నెట్టేసే ప్రయత్నం చేయగా.. ఎంపీలు అడ్డుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. అధికార, విపక్ష ఎంపీలు ఒకరిపైఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఇద్దరు ఎంపీలు కిందపడి దొర్లుతున్న వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఇందులో కిందపడిన ఒకర్ని మరో ఎంపీ కాలుతో తన్నడం కనిపించింది. సభ్యుల మధ్య వాగ్వాదానికి సంబంధించిన దృశ్యాలు ఈ వీడియోల్లో కనిపించాయి.

మాల్దీవుల పార్లమెంట్‌లో మెజారిటీ ఉన్న ప్రతిపక్ష ఎండీపీ.. అధికార పార్టీకి చెందిన నలుగురు సభ్యులను ముయిజ్జు క్యాబినెట్‌లోకి తీసుకునేందుకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అడ్డుకుంది. దీన్ని ఆమోదించడానికి నిరాకరించడంతో ఈ ఘటన తలెత్తింది. ఈ చర్యను ప్రజలకు అందించే సేవలను అడ్డుకోవడంతో సమానమని అధికార పీఎన్సీ, పీపీఎం ఒక ప్రకటన విడుదల చేశాయి. స్పీకర్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు.