మేడిగడ్డపై విజిలెన్స్ డిపార్ట్ మెంట్ దర్యాప్తు చేస్తున్నది: ఉత్తమ్

మేడిగడ్డపై విజిలెన్స్ డిపార్ట్ మెంట్ దర్యాప్తు చేస్తున్నది: ఉత్తమ్
  • ప్రాజెక్టులో అక్రమాలపై జ్యుడీషియల్ ​ఎంక్వైరీ చేయాలని హైకోర్టు సీజేకు లేఖ రాశాం 
  • రాష్ట్రానికి నీళ్లు ఇవ్వాలని మహారాష్ట్ర, కర్నాటకను కోరుతాం 
  • ఈ ఏడాది చివరి నాటికి కొత్తగా 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తం 
  • ఆయా పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై విచారణ మొదలైందని ఇరిగేషన్​శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి వెల్లడించారు. మేడిగడ్డపై ఇప్పటికే విజిలెన్స్​డిపార్ట్ మెంట్ విచారణ ప్రారంభించిందని చెప్పారు. జలసౌధతో పాటు కరీంనగర్, రామగుండం, మహదేవపూర్​నుంచి తీసుకొచ్చిన ఫైల్స్​ను విజిలెన్స్​అధికారులు పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ లోని జలసౌధలో ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై సిట్టింగ్​జడ్జితో విచారణ జరిపించాలని హైకోర్టు సీజేకు లేఖ రాశామని ఆయన తెలిపారు. ‘‘సీఎం రేవంత్​రెడ్డి ఆలోచన మేరకు కోయిన డ్యామ్ నుంచి వంద టీఎంసీలు తెలంగాణకు ఇవ్వాలని మహారాష్ట్రను కోరనున్నాం. కోయిన హైడల్​ప్రాజెక్టు నుంచి ఆ రాష్ట్రం ఉత్పత్తి చేసే కరెంట్​కు సమాన విలువైన డబ్బును ఆ రాష్ట్రానికి ఇచ్చే ఆలోచన చేస్తున్నాం. ఇక రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్​రిజర్వాయర్ల నుంచి 10 టీఎంసీలు విడుదల చేయాలని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్యను కలిసి విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్ర నీటి హక్కులను కాపాడేందుకు నిబద్ధతతో పని చేస్తాం” అని అన్నారు. ‘‘పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరాం. అయితే జాతీయ హోదా ఇచ్చేలా నిర్దిష్టమైన స్కీమ్ లేదని కేంద్రమంత్రి చెప్పారు. అయితే ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు వారం రోజుల్లోగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం” అని తెలిపారు. కాగా, కేసీఆర్ ​రీడిజైనింగ్​పేరుతో కాళేశ్వరం కట్టకుండా.. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టి ఉంటే, అందులో నాలుగో వంతు ఖర్చుతోనే 16 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు అందేవన్నారు. కేసీఆర్​చేసిన తప్పిదాలతో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. 

ప్రాజెక్టుల పనులు పూర్తి చేయండి.. 

ఈ ఏడాది చివరికి నిర్మాణంలో ఉన్న 18 ప్రాజెక్టుల కింద కొత్తగా 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ ​అధికారులు, ఇంజనీర్లను ఉత్తమ్ ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న​ప్రాజెక్టులపై జలసౌధలో  ఆయన సమీక్ష నిర్వహించారు. గోదావరిపై నిర్మాణంలో ఉన్న 11 ప్రాజెక్టులు, కృష్ణాపై నిర్మాణంలో ఏడు ప్రాజెక్టుల పనులు ఎంత వరకు వచ్చాయి? వాటిని ఎప్పట్లోగా పూర్తి చేయగలం? ఏయే పనులు చేస్తే కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చే అవకాశం ఉంటుంది? అనే అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాలమూరు–రంగారెడ్డి, ఎస్ఎల్ బీసీ టన్నెల్​ప్రాజెక్టు పరిధిలోని ఉదయ సముద్రం లిఫ్ట్, బ్రాహ్మణ వెల్లెంల లిఫ్ట్​స్కీమ్, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా లిఫ్ట్​స్కీమ్ లు సహా ఇతర ప్రాజెక్టుల కింద నీళ్లిచ్చే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సీఎంతో చర్చించి పనులు చేపట్టేందుకు అవసరమైన నిధులను విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. పంట కాల్వల కోసం అవసరమైన భూసేకరణ చేపట్టేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లతో చర్చించాలని సూచించారు. గోదావరిపై సీతారామ ఎత్తిపోతలు, గౌరవెల్లి, చిన్న కాళేశ్వరం, దేవాదుల థర్డ్​ఫేజ్, చనాకా–కొరాట, ఇందిరమ్మ వరద కాలువ సహా ఇతర ప్రాజెక్టుల పరిధిలో ఎక్కడెక్కడ కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చే ఆస్కారముందో ఆ పనులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఏడాది చివరి నాటికి కొత్తగా 4.50 లక్షల ఎకరాల నుంచి 5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా పనులు పూర్తి చేయాలన్నారు.

14 ఎంపీ సీట్లు గెలుస్తం.. 

సూర్యాపేట, వెలుగు: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో13 నుంచి 14 ఎంపీ సీట్లు సాధిస్తామని మంత్రి ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలంలోని దండు మైసమ్మ దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ నాయకుడు కాకి దయాకర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉత్తమ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్ బరిలోకి దిగినా.. సునాయాసంగా 13 నుంచి 14 స్థానాలు దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రామ మందిర ప్రారంభోత్సవాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈవెంట్ గా మారుస్తున్నారని విమర్శించారు. రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి శంకరాచార్యులు, మఠాధిపతులు ఎందుకు దూరంగా ఉంటున్నారో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. 


కొత్త ఆయకట్టు పనులకే ప్రాధాన్యం.. 

గత ​ప్రభుత్వం ఇరిగేషన్ ​ప్రాజెక్టుల కోసం ఎక్కువగా అప్పులు చేసినా.. ఫలితం మాత్రం రాలేదని ఉత్తమ్ అన్నారు. కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చే పనులకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఈ ఏడాది జూన్​లో ఏయే ప్రాజెక్టుల కింద ఎంతమేరకు నీళ్లు ఇవ్వగలం? ఏడాది చివరి నాటికి ఇంకా ఎంత ఆయకట్టును సాగులోకి తీసుకురాగలమో.. ఆయా పనులపై శ్రద్ధ పెట్టాలని అధికారులకు సూచించారు. ఐదేండ్లలో ఏ ప్రాజెక్టు పరిధిలో ఎంత కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇవ్వగలమో ఆ సమాచారం సిద్ధం చేయాలని ఆదేశించారు. మంథని నియోజకవర్గానికి నీళ్లిచ్చే చిన్న కాళేశ్వరం పనుల్లో వేగం పెంచాలన్నారు. ఎండాకాలంలో చెరువుల్లో పూడిక తీయాలని, జంగిల్ ​కట్టింగ్ ​పనులు చేపట్టాలన్నారు. వానాకాలం లోగా అన్ని చెరువుల్లో పూడికతీత పనులు పూర్తి చేయాలన్నారు. ఐడీసీ పరిధిలోని చిన్న లిఫ్ట్​స్కీమ్​లు పూర్తి స్థాయిలో పని చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.