కాళేశ్వరం అక్రమాలపై రంగంలోకి ఏసీబీ..అక్రమాల డొంక కదిలేనా.?

కాళేశ్వరం అక్రమాలపై రంగంలోకి ఏసీబీ..అక్రమాల డొంక కదిలేనా.?

కాళేశ్వరం కేసులో కీలక పరిణామం. కాళేశ్వరం అక్రమాలపై ఏసీబీ రంగంలోకి దిగనుంది.  కాళేశ్వరం ప్రాజెక్టుతో జరిగిన నష్టంపై  దర్యాప్తు జరపాలని ఏసీబీకి విజిలెన్స్ విభాగం లేఖ రాసింది.  కాంట్రాక్టర్ల నుంచి బాధ్యులు ఎలా లబ్ధి పొందారో విచారణ జరపాలని విజిలెన్స్ అధికారులు కోరారు. ఈ మేరకు విజిలెన్స్ రాసిన లేఖను సీఎస్‌ రామకృష్ణారావుకు పంపారు ఏసీబీ డీజీ. ప్రభుత్వంనుంచి అనుమతి రాగానే కాళేశ్వరంపై ఏసీబీ విచారణ జరపనుంది. 

కాళేశ్వరంలో భాగంగా సుందిళ్ల,అన్నారం,మేడిగడ్డ బ్యారేజీల అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో  కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పై ఇప్పటికే సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభించింది.  ప్రాజెక్ట్ లో అవకతవకలు, నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై ప్రాథమిక ఎంక్వైరీ మొదలు పెట్టింది.  ఎన్డీఎస్ ఏ  రిపోర్ట్, జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ రిపోర్ట్స్ పై ప్రాధమిక  దర్యాప్తు చేస్తోంది సీబీఐ.  అయితే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.. ప్రాథమిక దర్యాప్తు తర్వాత సీబీఐ  FIR నమోదు  చేసే అవకాశం ఉంది.  ఈ క్రమంలో విజిలెన్స్ కమిషన్ ఏసీబీకి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. 

కాళేశ్వరం ప్రాజెక్టులో  పనిచేసిన  అధికారులు ఒకరి తర్వాత ఒకరు అక్రమాస్తుల కేసుల్లో దొరికిపోతున్నారు. గత సర్కారులో అక్రమంగా వందల కోట్ల ఆస్తులు కూడబెట్టి ఇప్పుడు కటకటాలపాలవుతున్నారు. ఇప్పటికే ఈఎన్సీ హరిరామ్ , ఈఈ నూనె శ్రీధర్​ ఏసీబీ అధికారులకు చిక్కారు. వాళ్లిద్దరి అక్రమ ఆస్తులు రూ.350 కోట్లకుపైగా ఉంటాయని ఏసీబీ లెక్కల్లో తేటతెల్లమైంది. ఈ ఇద్దరే కాదు.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఇతర అధికారులకూ అవినీతిలో వాటా ఉందన్న  ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కరుగా ఏసీబీ చేతికి చిక్కుతుండడంతో.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసిన కొందరు కీలక ఇంజినీర్లకు బుగులు  పట్టుకుంది. తమకు కూడా ఇదే పరిస్థితి వస్తుందేమోనన్న ఆందోళనలో వారు ఉన్నారు. 

ప్రాజెక్టులో భారీ అవినీతి..!

కాళేశ్వరం టెండర్ల అప్పగింత నుంచి ప్రాజెక్టు ప్రారంభించేంత వరకు అడుగడుగునా అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయి.  ముఖ్యంగా కాంట్రాక్ట్​ సంస్థలకు అనుకూలంగా వ్యవహరించినందుకు కిందిస్థాయి అధికారులు మొదలు రాజకీయ నాయకుల వరకు భారీగా కమీషన్లు నడిచినట్లు చర్చ మొదటి నుంచీ ఉంది.  ముఖ్యంగా ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు, పంప్​హౌస్​లు, వివిధ ప్యాకేజీల పనుల్లో భారీ అవకతవకలు జరిగాయనే ఆరోపణలున్నాయి.  టెండర్లను నామినేషన్​ పద్ధతిలో ఇవ్వడం.. ప్రభుత్వం కోట్​ చేసిన దానికన్నా  ఎక్కువకు  టెండర్లను ఓకే చేయడంతోనే అవినీతి మొదలైందన్న వాదనలున్నాయి.  ఆ తర్వాత పంప్​హౌస్​ల మోటార్ల కొనుగోళ్లలోనూ అక్రమాలు జరిగాయనే ఆరోపణలూ వచ్చాయి. అసలు పంప్​హౌస్​లలోనే దాదాపు రూ.14 వేల కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్లు కాగ్​ రిపోర్ట్​తేల్చింది.