V6 News

జగిత్యాల బల్దియాలో విజిలెన్స్ తనిఖీలు

 జగిత్యాల బల్దియాలో విజిలెన్స్ తనిఖీలు
  • 60 మంది అధికారులతో విస్తృత సోదాలు
  • బిల్డింగ్‌‌ కొలతలు, ట్యాక్స్‌‌ వివరాలు సేకరించిన ఆఫీసర్లు

జగిత్యాల, వెలుగు : జగిత్యాల బల్దియాలో సోమవారం విజిలెన్స్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. రెవెన్యూ సెక్షన్‌‌పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. 60 మంది ఆఫీసర్లు ఏడు టీమ్స్‌‌గా ఏర్పడి సోదాలు చేశారు. ఈ సందర్భంగా బల్దియా పరిధిలో భవనాల అసెస్‌‌మెంట్లు, పన్ను విధింపులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. బల్దియా పరిధిలో ఉన్న ఏడు వేలకుపైగా కమర్షియల్, సెమీ కమర్షియల్‌‌ భవనాలకు రూల్స్‌‌ ప్రకారం ట్యాక్స్‌‌ విధించారా ? లేదా ? అనే వివరాలు సేకరించారు. అనంతరం ఒక్కో టీమ్‌‌ 15కి పైగా భవనాలను తనిఖీ చేయగా మొత్తం సుమారు 100 భవనాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి కొలతలు తీసుకున్నారు. తనిఖీలో తేలిన వివరాల ఆధారంగా రిపోర్ట్‌‌ తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు.

జనగామ సబ్‌‌రిజిస్ట్రార్‌‌ ఆఫీస్‌‌లో..

జనగామ, వెలుగు : జనగామ సబ్‌‌ రిజిస్ట్రార్‌‌ ఆఫీస్‌‌ను సోమవారం విజిలెన్స్‌‌ ఆఫీసర్లు తనిఖీ చేశారు. సబ్‌‌ రిజిస్ట్రార్‌‌ ఆఫీస్‌‌కు చేరుకున్న విజిలెన్స్‌‌ ఆఫీసర్లు రాకేశ్, గౌతంరెడ్డి, లక్ష్మణ్‌‌.. జనగామ సబ్‌‌ రిజిస్ట్రేషన్‌‌ ఆఫీస్‌‌కు చేరుకున్న సమయంలో ఓ ప్రైవేట్‌‌ డాక్యుమెంట్‌‌ రైటర్‌‌ ఆఫీస్‌‌లోనే ఉన్నాడు. అతడిని రిజిస్ట్రార్‌‌ దీపక్‌‌ వద్దకు పిలిపించి.. డాక్యుమెంట్‌‌ రైటర్‌‌ ఆఫీస్‌‌లో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. రైటర్‌‌ కాస్త తడబడడంతో.. రిజిస్ట్రార్‌‌కు ఎన్ని డబ్బులు ఇస్తున్నారంటూ ప్రశ్నించారు. 

తాము ఎలాంటి డబ్బులు ఇవ్వడం లేదని చెప్పిన డాక్యుమెంట్‌‌ రైటర్‌‌.. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత ఆఫీసర్లు ఏడాది కాలంగా జరిగిన రిజిస్ట్రేషన్‌‌ రికార్డులను పరిశీలించారు. రిజిస్ట్రేషన్లు జరిగిన తర్వాత డాక్యుమెంట్లను కొనుగోలు చేసిన వారికి పంపిస్తున్నారా..? లేదా..? అనే విషయాన్ని తెలుసుకున్నారు. అనంతరం కొన్ని డాక్యుమెంట్లను తమ వెంట తీసుకెళ్లారు. విజిలెన్స్‌‌ ఆఫీసర్లు వచ్చినట్లు తెలియడంతో డాక్యుమెంట్‌‌ రైటర్లు తమ ఆఫీస్‌‌లు మూసివేసి పరార్‌‌ అయ్యారు. ఆఫీసర్లు వెళ్లిన తర్వాత వచ్చి తమ ఆఫీసులను ఓపెన్‌‌ చేశారు.