 
                                    - డీఎస్పీ అధికారి నేతృత్వంలో స్పెషల్ టీమ్స్
- సోదాల్లో విజిలెన్స్‌తోపాటు పోలీస్, విద్యాశాఖ అధికారులు
- విద్యార్థులు, స్టాఫ్, ఫీజులు, స్కాలర్‌షిప్, రీయింబర్స్‌మెంట్ వివరాలపై ఆరా
హైదరాబాద్, వెలుగు: సర్కారు ఆదేశాలతో ప్రైవేట్ కాలేజీల్లో తనిఖీలకు విజిలెన్స్ అధికారులు సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు సహా ఇంజినీరింగ్ కాలేజీల్లో అతి త్వరలో సోదాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలపై విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తూ.. సీఎస్ రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ డీజీ శిఖా గోయల్ విజిలెన్స్‌లోని ఉన్నతాధికారులతో గురువారం భేటీ అయినట్లు తెలిసింది. సీఎస్ నుంచి వచ్చిన మెమోలో పేర్కొన్న విధివిధానాలకు అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం విజిలెన్స్ డీఎస్పీ స్థాయి అధికారితో పాటు విద్యాశాఖ అధికారులు, యూనివర్సిటీల టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్, పోలీసులతో కూడిన స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేయనున్నారు. అవసరమైతే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) సహకారం కూడా తీసుకోనున్నట్లు తెలిసింది.
అడ్మినిస్ట్రేషన్ రికార్డులే కీలకంగా..
రాష్ట్ర విజిలెన్స్‌లో ఎస్పీ స్థాయి అధికారి నుంచి డీఎస్పీలు, అడిషనల్ ఎస్పీలతో కూడిన 7 యూనిట్లు పనిచేస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని కాలేజీల్లో ఆయా యూనిట్ల అధికారులు సోదాలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం.. కాలేజీల్లో ఫీజులు, విద్యార్థుల సంఖ్య, స్కాలర్ షిప్స్, ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సహా పూర్తి వివరాలు సేకరించనున్నట్లు తెలిసింది.
ఈ మేరకు కాలేజీ అడ్మినిస్ట్రేషన్ రికార్డులను స్వాధీనం చేసుకొని, విద్యాశాఖ అధికారులతో వాటిని పరిశీలించనున్నారు. వీటి ఆధారంగా ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపనున్నారు. ఒకవేళ రికార్డులను ట్యాంపరింగ్ చేసినా.. వాటిని అధునాత టెక్నాలజీతో గుర్తించేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలిసింది.
విద్యార్థులు ధైర్యంగా పోరాడాలి: బండి సంజయ్
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు అడిగితే కాలేజీలపై విజిలెన్స్ దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఫీజు బకాయిల కోసం కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు, సిబ్బంది ధైర్యంగా పోరాడాలని గురువారం ఒక ప్రకటనలో సూచించారు. 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయాలని ప్రశ్నించారు.
మాట తప్పిన కాంగ్రెస్ నేతలపై విజిలెన్స్ దాడులు చేస్తారా.. అంటూ నిలదీశారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో 15 లక్షల మంది విద్యార్థులు అల్లాడిపోతున్నా పట్టించుకోరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్టిఫికెట్లు రాక, ఉద్యోగాల్లో చేరలేక, ఉన్నత చదువులకు వెళ్లలేక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నారు.
నాలుగేండ్లుగా ఫీజు బకాయిలు చెల్లించకపోతే విద్యాసంస్థలు ఎలా కొనసాగుతాయని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గర పడ్డాయని, ఫీజు బకాయిల పోరాటానికి బీజేపీ మద్దతిస్తుందని స్పష్టం చేశారు.

 
         
                     
                     
                    