
సినిమా విడుదల సమయంలో ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. ఈ సినిమాకూ అలాగే ఫీలయ్యాం. అయితే మొదటి షో పూర్తయ్యాక పాజిటివ్ టాక్ రావడంతో హ్యాపీ అయ్యా. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో, ఓవర్సీస్‌లోనూ రెస్పాన్స్ బాగుంది. అయితే ఒక సినిమా హిట్ అయిందని రిలాక్స్ అవలేం. ఇంకా బెటర్ మూవీ చేయాలనే బాధ్యత పెరుగుతుంది.
ఈ సినిమా రిఫరెన్స్ కోసం ‘వైకింగ్స్, ది లాస్ట్ కింగ్డమ్ లాంటి సిరీస్‌లు వరుసపెట్టి చూశా. అలాగే లుక్ పరంగానూ మరింత దృఢంగా కనిపించే ప్రయత్నం చేశాను. అయితే కానిస్టేబుల్ పాత్రకు సంబంధించిన సీన్స్ మాత్రం ‘ఫ్యామిలీ స్టార్’ కంటే ముందు షూట్ చేయడంతో సన్నగా కనిపిస్తా.
ఈ కథలో చాలా లేయర్స్ ఉండడంతో ఒకే పార్ట్‌లో సాధ్యంకాదని రెండు భాగాలుగా ప్లాన్ చేశాం. సెకండ్ పార్ట్ ఇంకా అద్భుతంగా ఉండబోతుంది. రానా ఇందులో నటిస్తాడనే ప్రచారం నిజం కాదు. కచ్చితంగా ఓ స్టార్ ఉండబోతున్నారు.
ఇందులో పాట తీసేయాలన్న నిర్ణయం దర్శకుడు గౌతమ్, ఎడిటర్ నవీన్ నూలిదే. పాటలోని కంటెంట్ మొత్తం ముందే చూపించాం కనుక సరైన ప్లేస్‌మెంట్ కుదరక వద్దనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ పాటనే అంతా అడుగుతున్నారు.
నిజానికి ఈ సినిమాకు ముందుగా ‘దేవర నాయక’ అనే టైటిల్ అనుకున్నాం. కానీ జూనియర్ ఎన్టీఆర్ అన్న ‘దేవర’ సినిమా వస్తుండడంతో ‘కింగ్‌డమ్’గా మార్చుకున్నాం.
నేను ఏ డైలాగ్ చెప్పినా తెలంగాణ యాసలో ఉందంటారు. ‘కల్కి’లో అర్జునుడి పాత్ర కోసం నాగ్ అశ్విన్ రాసిన డైలాగ్‌నే చెప్పాను. అసలు అర్జునుడి మాతృభాష ఏమిటి.. ఎలా మాట్లాడతాడు, అలాంటి డైలాగ్స్‌కు రిఫరెన్స్‌లు ఉంటాయా.. ప్రతి దానికి నా యాస గురించి మాట్లాడేవాళ్లకు నేనేం చెప్పలేను. నిజానికి నెగిటివిటీ గురించి నేను అంతగా ఆలోచించను. అది చాలా సాధారణ విషయం. దానిపై నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు.
పదేళ్ల కిందట నేను ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఇంతమంది ఆదరిస్తున్నారంటే అది నా అదృష్టం. ‘అర్జున్ రెడ్డి’ ఆడియో వేడుకకు ఎవరైనా వస్తారా అనుకున్నాం. కానీ వందలమంది వచ్చారు. వాళ్ల కోసం ఏదైనా చేయాలనిపించి నాకు వచ్చిన బెస్ట్ యాక్టర్ అవార్డును వేలం వేస్తే రూ.25 లక్షలు వచ్చాయి. ఆ సినిమాకు నా రెమ్యూనరేషనే రూ.5 లక్షలు.
నెక్స్ట్ మూవీని రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నా. ఆ తర్వాత రవికిరణ్ కోలా డైరెక్షన్‌లో సినిమా ఉంటుంది. అది ఆంధ్రా నేపథ్యంలో జరిగే కథ.