
హీరో విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి దగ్గర ముందు వెళ్తోన్న బొలెరో వాహనం సడెన్ బ్రేక్ వేయడంతో విజయ్ కారు ఢీ కొట్టింది. దీంతో విజయ్ దేవరకొండ కారు పాక్షికంగా దెబ్బతింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విజయ్ పుట్టపర్తి వెళ్లి తిరిగి హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
విజయ్ అక్టోబర్ 5న పుట్టపర్తిని దర్శించుకున్నారు. తిరిగి హైదరాబాద్ వచ్చేటపుడు జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి శివారులోని వరసిద్ధి వినాయక పత్తి మిల్లు దగ్గరకు రాగానే విజయ్ కారు ప్రమాదానికి గురైంది.
విజయ్ దేవర కొండ డ్రైవర్ అందే శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటన తర్వాత మరో కారులో విజయ్ దేవరకొండ హైదరాబాద్ కు వెళ్లారు.
విజయ్ చేతికి ఎంగేజ్‌మెంట్ రింగ్!
విజయ్ ,రష్మిక నిశ్చితార్థం వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో పుట్టపర్తిలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహా సమాధిని దర్శన సమయంలో విజయ్ చేతికి ఉన్న రింగ్ వైరల్ అవుతోంది. విజయ్,రష్మిక ఎంగేజ్ మెంట్ రింగ్ అని అందరు చర్చించుకుంటున్నారు.
విజయ్ తన నిశ్చితార్థం తర్వాత తొలిసారిగా బహిరంగ ప్రదేశంలో కనిపించడం, అదీ తన కుటుంబ సమేతంగా ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లడం... ఈ రెండు సంఘటనలూ అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఆయన కుడిచేతి ఉంగరం వేలికి మెరుస్తున్న రింగ్ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఈ రింగ్ బంధమే విజయ్-రష్మిక నిశ్చితార్థానికి బలమైన ఆధారాన్ని ఇస్తోందని నెటిజన్లు గట్టిగా నమ్ముతున్నారు