
వెంకన్న స్వామి తన పక్కనుండి నడిపిస్తే.. చాలా పెద్దోడిని అయిపోతాను అని అన్నాడు హీరో విజయ్ దేవరకొండ. తను హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాగవంశీ నిర్మించిన చిత్రం ‘కింగ్డమ్’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. జులై 31న సినిమా విడుదల కానుంది. తాజాగా తిరుపతిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘ఎప్పటిలాగే ఈ సినిమా కోసం కూడా ప్రాణం పెట్టి పనిచేశాను. ఆ వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులు ఉంటే.. ఈ సినిమాతో ఘన విజయం సాధిస్తాను’ అని అన్నాడు.
భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ ‘ఈ సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. విజయ్ పడిన కష్టాన్ని త్వరలో స్క్రీన్‌పై చూడబోతున్నారు. ప్రేక్షకుల హృదయం లోపల నేను స్థానాన్ని సంపాదిస్తానని ఆశిస్తున్నా’ అని చెప్పింది. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘ఈ సినిమా మా రెండున్నరేళ్ల కష్టం. తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త రకమైన యాక్షన్ గ్యాంగ్‌స్టర్ సినిమాని చూపించబోతున్నాం. ట్రైలర్‌లో చూసింది శాంపిల్ మాత్రమే. విజయ్ దేవరకొండ గారి అభిమానులు గత నాలుగైదు సంవత్సరాలలో ఏం మిస్ అయ్యారో.. అది ఇందులో ఉంటుంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో విజయ్ గారి కళ్ళలో ఏ ఇంటెన్సిటీ చూశారో.. అది ఇందులో ఉంటుంది’ అని చెప్పారు.