హజారేకు స్టార్ పవర్.. ఇవాళ్టి (డిసెంబర్ 24) నుంచి విజయ్‌‌ హజారే వన్డే టోర్నీ.. బరిలో కోహ్లీ, రోహిత్‌

హజారేకు స్టార్ పవర్.. ఇవాళ్టి (డిసెంబర్ 24) నుంచి విజయ్‌‌ హజారే వన్డే టోర్నీ.. బరిలో కోహ్లీ, రోహిత్‌
  • గిల్, సూర్య, పంత్‌‌ కూడా
  •     ఐదు గ్రూపుల్లో 38 జట్ల పోటీ

బెంగళూరు: టీమిండియా సూపర్‌‌‌‌ స్టార్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బరిలో నిలిచిన నేషనల్ వన్డే చాంపియన్‌‌షిప్‌‌ విజయ్ హజారే ట్రోఫీకి రంగం సిద్ధమైంది.  బీసీసీఐ నిబంధనల ప్రకారం సీనియర్ ఆటగాళ్లు కనీసం రెండు మ్యాచ్‌‌లు ఆడటం తప్పనిసరి కావడంతో ‘రోకో’తో పాటు రిషబ్ పంత్‌‌, శుభ్‌‌మన్ గిల్, సూర్యకుమార్‌‌‌‌, అభిషేక్ శర్మ వంటి మేటి ప్లేయర్లు కూడా తమ రాష్ట్రాల జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాంతో వేర్వేరు వేదికల్లో బుధవారం మొదలయ్యే ఈ ఎడిషన్‌‌కు గతంలో ఎన్నడూ లేనంత క్రేజ్ ఏర్పడింది. 

ఇండియా ప్లేయర్లంతా టోర్నీలో తమదైన ముద్ర వేయాలని భావిస్తుండగా..  హజారే ద్వారా సెలెక్టర్లను మెప్పించి నేషనల్‌‌ టీమ్‌‌లోకి రావాలని కుర్రాళ్లు ఆశిస్తున్నారు. ఈ మెగా టోర్నీలో 38 జట్లు ఐదు గ్రూపుల్లో పోటీకి సిద్ధమవగా.. డిఫెండింగ్ చాంపియన్ కర్నాటక మరోసారి ఫేవరెట్‌‌గా బరిలోకి దిగుతోంది. ఎలైట్ గ్రూప్‌‌–బిలో ఉన్న హైదరాబాద్ రాజ్‌‌కోట్‌‌లో జరిగే మ్యాచ్‌‌లో ఉత్తరప్రదేశ్‌‌తో తలపడనుంది 

15 ఏండ్ల తర్వాత కోహ్లీ.. ఖాళీ స్టేడియంలో ఆట

ఈ టోర్నీలో విరాట్ కోహ్లీ  దాదాపు 15 ఏండ్ల  తర్వాత తొలిసారి బరిలోకి దిగుతున్నాడు. ఇందుకోసం ముంబైలో ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్‌‌ బంగర్‌‌‌‌ సమక్షంలో ట్రైనింగ్‌‌లో పాల్గొన్నాడు. తను ఢిల్లీ తరఫున 2 లేదా 3 మ్యాచ్‌‌లు ఆడే చాన్సుంది. గ్రూప్‌‌–డిలో ఉన్న ఢిల్లీ.. బెంగళూరులో తొలి రెండు మ్యాచ్‌‌ల్లో ఆంధ్ర, గుజరాత్ జట్లతో తలపడనుంది.  ఢిల్లీ–ఆంధ్ర మ్యాచ్‌‌ను చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించాలని అనుకున్నా.. భద్రతా కారణాల దృష్ట్యా కర్నాటక ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. 

దాంతో ఈ పోరును బీసీసీఐ సెంటర్ ఆఫ్‌‌ ఎక్సలెన్స్‌‌లో ఖాళీ మైదానంలో నిర్వహించాలని నిర్ణయించారు. మంగళవారం రాత్రి కోహ్లీ బెంగళూరు చేరుకున్నాడు. దాంతో తొలి రెండు మ్యాచ్‌‌ల్లో తను బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు శార్దూల్ ఠాకూర్ కెప్టెన్సీలోని ముంబై తరఫున రోహిత్ శర్మ 2017–-18 తర్వాత మళ్లీ విజయ్ హజారేలో ఆడుతున్నాడు. సిక్కిం, ఉత్తరాఖండ్‌‌తో జైపూర్‌‌లో జరిగే తొలి రెండు మ్యాచ్‌‌ల్లో పాల్గొంటానని రోహిత్ ఇప్పటికే స్పష్టం చేశాడు. ఇటీవల ఆస్ట్రేలియా,  సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌‌ల్లో రాణించిన రోహిత్‌‌, కోహ్లీ అదే జోరును ఇక్కడా  కొనసాగించాలని ఫ్యాన్స్‌‌ ఆశిస్తున్నారు. 

వాళ్లకు కీలకం..

ఈ టోర్నీ ‘రోకో’ కంటే సూర్యకుమార్‌‌‌‌, రిషబ్‌‌ పంత్‌‌ వంటి ప్లేయర్లకు కీలకం కానుంది. గత 22 ఇన్నింగ్స్‌‌ల్లో నిరాశపరిచిన టీ20 కెప్టెన్‌‌ సూర్య కుమార్‌‌ తన ఫామ్‌‌ను తిరిగి అందుకునేందుకు ఇదే మంచి చాన్స్‌. ఇక, టీ20 వరల్డ్ కప్ టీమ్‌‌లో చోటు కోల్పోయిన శుభ్‌‌మన్‌‌ గిల్.. తన కోపాన్ని, కసిని పంజాబ్ తరఫున పరుగులుగా మలచాలని చూస్తున్నాడు. మరోవైపు ఢిల్లీ కెప్టెన్‌‌గా పంత్ తన వైట్-బాల్ క్రికెట్ సత్తాను నిరూపించుకుని  షార్ట్ ఫార్మాట్‌‌లో  టీమిండియాలోకి తిరిగి రావాలని పట్టుదలతో ఉన్నాడు.

పేసర్లపై ఫోకస్‌‌

ఈ టోర్నీలో యంగ్ బౌలర్లు ముఖ్యంగా మహ్మద్ సిరాజ్ తర్వాత నేషనల్ టీమ్‌‌ తరఫున మెప్పించే సత్తా ఉన్న పేసర్లపై సెలెక్టర్లు దృష్టి సారించనున్నారు. వీరిలో గుర్జప్‌‌నీత్ సింగ్ (తమిళనాడు), గుర్నూర్ బ్రార్ (పంజాబ్), యుధ్‌‌వీర్ సింగ్ (జమ్మూ కాశ్మీర్), అనుజ్ థక్రాల్‌‌ (హర్యానా), షకీబ్ హుస్సేన్ (బీహార్‌‌‌‌) తదితరులు సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించే చాన్సుంది.ఏదేమైనా  ఒకవైపు కుర్రాళ్లు  తమ సత్తా చాటాలని చూస్తుంటే, మరోవైపు దిగ్గజాలు తమ ఫామ్‌‌ను నిరూపించుకోవాలని ఆశిస్తున్న ఈ వన్డే టోర్నీ క్రికెట్ అభిమానులకు పండగే అనొచ్చు.