మరోసారి గవర్నర్‎ను కలిసిన విజయ్.. తమిళనాడులో ఏం జరగబోతుంది..?

మరోసారి గవర్నర్‎ను కలిసిన విజయ్.. తమిళనాడులో ఏం జరగబోతుంది..?

చెన్నై: టీవీకే చీఫ్ విజయ్ మరోసారి గవర్నర్‎ను కలిశారు. గురువారం (మే 7) ఉదయం లోక్ భవన్‎కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‎తో భేటీ అయ్యారు. అసెంబ్లీలో తన టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించిందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికే ఓసారి గవర్నర్‎ను కలిసిన విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సంఖ్యా బలం లేకపోవడంతో విజయ్ రిక్వెస్ట్‎ను గవర్నర్ తిరస్కరించారు. ఈ క్రమంలో రెండోసారి గవర్నర్‎తో విజయ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఈసారి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించకపోతే సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో విజయ్ ఉన్నట్లు టీవీకే పార్టీ వర్గాలు వెల్లడించాయి. గవర్నర్ నిర్ణయంతో మే 7న జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకారం వాయిదా పడగా.. ఈసారి గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి కూడా గవర్నర్ అపాయిట్మెంట్ కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో తమిళనాడు రాజకీయాల్లో అసలేం జరుగుతుందని తీవ్ర చర్చనీయాంశంగా మారింది.