దేశమంతా ‘విజయ’ బ్రాండ్ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

దేశమంతా ‘విజయ’ బ్రాండ్ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  •     శివరాంపల్లిలో మెగా ఆయిల్ ప్యాకింగ్ కేంద్రం, మినరల్ వాటర్ ప్లాంట్
  •     మంత్రి శ్రీధర్​బాబుతో కలిసి ప్రారంభించిన తుమ్మల

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: విజయ ఆయిల్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలని, విజయ బ్రాండ్‌‌‌‌‌‌‌‌ను జాతీయ స్థాయి బ్రాండ్‌‌‌‌‌‌‌‌గా తీర్చిదిద్దాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు. శుక్రవారం హైదరాబాద్​శివరాంపల్లిలో టీజీ ఆయిల్‌‌‌‌‌‌‌‌ఫెడ్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయ మెగా ఆయిల్‌‌‌‌‌‌‌‌ ప్యాకింగ్ కేంద్రం, విజయ వర్షి మినరల్ వాటర్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ ఉత్పత్తుల విస్తరణ, నాణ్యత, మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌ వ్యూహాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. 

విజయ బ్రాండ్‌‌‌‌‌‌‌‌కు రాష్ట్రంలో వినియోగదారుల నుంచి మంచి ఆదరణ, విశ్వాసం ఉందని తుమ్మల పేర్కొన్నారు. నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవడం ద్వారా విజయ ఆయిల్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో విజయ బ్రాండ్‌‌‌‌‌‌‌‌కు ఉన్న మార్కెట్‌‌‌‌‌‌‌‌ను ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని మంత్రి సూచించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నూనెగింజల సాగును ప్రోత్సహించడం, రైతులకు మెరుగైన మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌ అవకాశాలు కల్పించడం, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడం ద్వారా విజయ బ్రాండ్‌‌‌‌‌‌‌‌ను మరింత విస్తరించాలని పేర్కొన్నారు.