బర్రెపాలు లీటరుకు రూ.2.71 పైసలు, ఆవుపాలపై రూ.5 పెంపు

బర్రెపాలు లీటరుకు రూ.2.71 పైసలు, ఆవుపాలపై రూ.5 పెంపు

హైదరాబాద్‌‌, వెలుగు : రైతుల నుంచి సేకరిస్తున్న పాల ధరలను పెంచుతున్నామని విజయ డెయిరీ ప్రకటించింది. సెప్టెంబరు 1 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది. సోమవారం రాజేంద్రనగర్‌‌లో పాడి రైతులు, పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సదస్సులో మంత్రి తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్‌‌  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బర్రెపాల సేకరణ ధరను లీటరుకు రూ.46.69 నుంచి రూ.49.40కు పెంచామని, ఆవుపాల ధరను లీటరుకు రూ.33.75 నుంచి రూ.38.75కు పెంచామని తెలిపారు. అలాగే సొసైటీ నిర్వహణకు ప్రస్తుతం వానాకాలంలో లీటరుకు రూ.1.25 నుంచి రూ.2, వేసవి కాలంలో రూ.1.50 నుంచి రూ. 2.25కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు.

పెంచిన ధరలతో ప్రతినెలా డెయిరీపై రూ.1.42 కోట్ల భారం పడుతుందని, పాడి రైతుల అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి చెప్పారు. విజయ డెయిరీకి పాలుపోసే రైతుల్లో ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీతో పాడి పశువులను అందించామని తెలిపారు. పాలకు లీటరుకు రూ.4 నగదు ప్రోత్సాహం అందిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న పాడిపరిశ్రమ అభివృద్ది కోసం పాడి రైతులతో రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు.