ఫ్లోరైడ్ మీద ఉద్యమం చేసిన : మాజీ ఎంపీ విజయశాంతి 

ఫ్లోరైడ్ మీద ఉద్యమం చేసిన : మాజీ ఎంపీ విజయశాంతి 

చౌటుప్పల్, వెలుగు: నామినేషన్ సమయంలో బ్బెబ్బెబ్బె అన్న అభ్యర్థి కావాలో..ప్రజలకు సాయం చేసే రాజగోపాల్ రెడ్డి కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని బీజేపీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీ  విజయశాంతి అన్నారు. ఆదివారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని చౌటుప్పల్ మండలం కుంట్లగూడెంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ తనకు మునుగోడు నియోజకవర్గంతో విడదీయరాని బంధం ఉందని, తల్లి తెలంగాణ పార్టీతో ఫ్లోరైడ్ పై ఉద్యమం చేశానన్నారు. 250 మంది ఫ్లోరైడ్​ బాధితులను తీసుకువెళ్లి సీఎంకు చూపించానని గుర్తు చేశారు. ‘2018 నుంచి రాజగోపాల్ రెడ్డి మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని అడుగుతూనే ఉన్నాడు, కానీ సీఎం స్పందించలేదు’ అని అన్నారు.

అసెంబ్లీలో మైక్ కట్ చేసి నోరు నొక్కారని, ఎవరు ప్రశ్నించినా కేసీఆర్ కు ఇష్టం ఉండదని విజయశాంతి అన్నారు. కేసీఆర్ ​ఎదురుగా దెబ్బ కొట్టడని, చాటుగా పావులు కదుపుతారన్నారు. కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది నాయకులతో కేసీఆర్ కు అండర్ స్టాండింగ్ ఉందన్నారు.  కాంగ్రెస్, టీఆర్ఎస్  కుమ్మక్కై రాజగోపాల్ రెడ్డి పై నిందలు వేస్తున్నారన్నారు. ఉద్యమకాలంలో చాలా మంది ఇచ్చిన డబ్బులతో కేసీఆర్ ఆస్తులు కొని, పేపర్, టీవీలు పెట్టుకున్నాడని ఆరోపించారు.  ప్రచారంలో బీజేపీ మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్​ కమిటీ చైర్మన్​ వివేక్​ వెంకటస్వామి పాల్గొన్నారు.