వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయిరెడ్డి

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా విజయసాయిరెడ్డి

అమరావతి, వెలుగు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఆ పార్టీ చీఫ్, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు. వైసీపీ లోక్‌సభాపక్ష నేతగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, విప్‌గా మార్గాని భరత్‌ను నియమించారు. వీరి నియామకంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి జగన్ లేఖ రాశారు. పార్టీ ఏర్పాటుకు ముందు నుంచే విజయసాయిరెడ్డి జగన్ వెంట ఉన్నారు. ఆర్థిక వ్యవహార నిపుణుడిగా పేరున్న విజయసాయిరెడ్డిని జగన్ కేబినెట్ లోకి తీసుకుని ఆర్థిక శాఖ కట్టబెడతారని మొదట్లో ప్రచారం జరిగింది.

జగన్ సీఎం కాకముందు ఢిల్లీలో పార్టీ వ్యవహారాలను చక్కబెట్టిన విజయసాయిరెడ్డికి పార్లమెంటరీ పార్టీ నేతగా అవకాశం దక్కింది. తనను వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించినందుకు ఏపీ సీఎం జగన్ కు విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అధినేత ఆశయాలకు అనుగుణంగా ప్రత్యేక హోదాపై  పోరాడతామని ట్వీట్ చేశారు.  వైసీపీ లోకసభాపక్ష నేతగా నియమితులైన మిథున్ రెడ్డి, చీఫ్ విప్ గా నియమితులైన మార్గాని భరత్ కు శుభాకాంక్షలు చెప్పారు.