
బీజేపీ పార్టీకి విజయశాంతి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి రాజీనామా లేఖను పంపించారు. గురువారం (నవంబర్ 16న) కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు టికెట్ దక్కలేదు. కొద్ది రోజుల నుంచి పార్టీ అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. బండి సంజయ్ ను తొలగించి.. కిషన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
దాదాపు పదేళ్లపాటు బీజేపీలో కొనసాగిన ఆమె 2009లో బయటకు వచ్చి తల్లీ తెలంగాణ పేరు రాజకీయ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్(అప్పటి టీఆర్‌ఎస్)లో విలీనం చేశారు. 2009లోనే మెదక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి నెగ్గారు. సీఎం కేసీఆర్‌తో విభేదాల వల్ల 2014లో ఆమె కాంగ్రెస్‌లో చేరారు.
అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. నాలుగేళ్ల తర్వాత కాంగ్రెస్‌లో ఆమెకు ఎన్నికల స్టార్ క్యాంపెయినర్, టీపీసీసీకి ఎన్నికల ప్రచార కమిటీ సలహాదారుగా నియమించారు అప్పటి ఏఐసీసీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ. 2020లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విజయశాంతి.. అదే ఏడాది డిసెంబర్‌లో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. తాజాగా బీజేపీకి రాజీనామా చేసి, మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.