ప్రతిపక్ష లీడర్లను గౌరవించడం ..వాజ్​పేయి, పీవీని చూసి నేర్చుకున్న

ప్రతిపక్ష లీడర్లను గౌరవించడం ..వాజ్​పేయి, పీవీని చూసి నేర్చుకున్న

హైదరాబాద్, వెలుగు:  రాజకీయంగా ఎవరు.. ఏ పార్టీలో ఉన్నా.. ప్రతిపక్ష నేతలను వ్యక్తిగతంగా గౌరవించడం అనేది నాటి మాజీ ప్రధానులు వాజ్​పేయి, పీవీ నర్సింహా రావు నుంచి నేర్చుకున్నట్లు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇప్పటి ప్రధాని నరేంద్ర మోదీ వరకు కూడా తాను ఇదే ఫాలో అవుతున్నట్లు తెలిపారు. శుక్రవారం ఈమేరకు ప్రెస్​నోట్ రిలీజ్ చేశారు. 

పెద్దలు నేర్పిన సంస్కృతి కారణంగానే.. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీపై రాజకీయాలకు అతీతంగా అభిమానం చాటుకున్నట్లు పేర్కొన్నారు. సోనియాను గౌరవించేలా ప్రకటన చేశానని వివరించారు. ఆ ప్రకటనపై కూడా కొందరు మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ పదవీ విరమణ చేస్తున్న సందర్భంలోనూ.. మోదీ కూడా ఆయనపై గౌరవం చూపారని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా కొనసాగించిన మోదీ సంస్కృతి, సంస్కారమే తనలాంటి వారికి అబ్బిందని స్పష్టం చేశారు.