తెలంగాణలో ఎన్నో కళలు ఉన్నాయి. ఎంతోమంది గొప్ప కళాకారులు ఉన్నారు. వారందరి ప్రతిభ ప్రపంచానికి తెలిసేలా చేయాలని ప్రముఖ సినీ రచయిత, రాజ్యసభ సభ్యులు కేవీ విజయేంద్రప్రసాద్ అన్నారు. డా. పొన్నం రవిచంద్ర రాసిన ‘తెలంగాణ సినీ ప్రస్థానం’ పుస్తక పరిచయ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ పుస్తక రచనతో రవిచంద్ర ఒక గొప్ప ప్రయత్నం చేశారని, ఆ అపురూప చిత్రాలను తిరిగి మన ప్రేక్షకులకు చేరువ చేయాలని విజయేంద్ర ప్రసాద్ కోరారు.
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత మామిడి హరికృష్ణకు ఈ పుస్తకాన్ని అంకితమిచ్చారు. తెలంగాణ సినిమా గురించి ఎంతో సమాచారాన్ని ఈ పుస్తకం ద్వారా తెలియజేసే ప్రయత్నం అభినందనీయమని హరికృష్ణ అన్నారు. పైడి జయరాజ్, ఆయనకు ముందు నుంచే చాలామంది తెలంగాణ ప్రాంత నటీనటులు, సాంకేతిక నిపుణులు సినిమా ఇండస్ట్రీలో ప్రతిభ చాటారని రచయిత పొన్నం రవిచంద్ర ఈ సందర్బంగా గుర్తుచేశారు. ఎంతో విలువైన సమాచారాన్ని ఇందులో పొందుపరిచారని అతిథులుగా హాజరైన నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్, దర్శకులు అల్లాణి శ్రీధర్, వేణు ఊడుగుల, రచయితలు ఎస్ వీ రామారావు, అయినంపూడి శ్రీలక్ష్మి, జర్నలిస్ట్ ప్రభు ప్రశంసించారు.
