విజయ్ టీవీకే పార్టీకి ఎన్నికల గుర్తు కేటాయించిన ఈసీ.. ఏం సింబల్ అంటే..?

విజయ్ టీవీకే పార్టీకి ఎన్నికల గుర్తు కేటాయించిన ఈసీ.. ఏం సింబల్ అంటే..?

చెన్నై: విజయ్ తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం కామన్ సింబల్ కేటాయించింది. టీవీకే పార్టీకి విజిల్ గుర్తు కేటాయిస్తూ  గురువారం (జనవరి 22) ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం కామన్ సింబల్ కేటాయించాలని ఆటో, విజిల్, క్రికెట్ బ్యాట్ గుర్తుల కోసం టీవీకే దరఖాస్తు చేసుకుంది. టీవీకే పార్టీ దరఖాస్తు పరిశీలించిన ఈసీ విజిల్ గుర్తు కేటాయించింది. దీంతో 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ అభ్యర్థులు విజిల్ చిహ్నాంతో పోటీ చేయనున్నారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ (MNM) పార్టీకి కూడా ఈసీ సింబల్ అలాట్ చేసింది. 

ఎంఎన్ఎం పార్టీకి బ్యాటరీ టార్చ్‎ను గుర్తుగా కేటాయించింది. ఈ రెండు పార్టీలు పోటీ చేయని స్థానాల్లో ఆ గుర్తులను ఇతర అభ్యర్థులకు కేటాయిస్తారు. ఈ గుర్తులు కేవలం శాసనసభలకు లేదా లోక్‌సభకు జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు మాత్రమే. ఎన్నికలు పూర్తయిన తర్వాత సంబంధిత పార్టీలు ఉమ్మడి చిహ్నాన్నిఉపయోగించడానికి అనుమతి లేదని ఎన్నికల సంఘం పేర్కొంది. కాగా, 2026 ఏప్రిల్, మేలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 

►ALSO READ | ట్రాఫిక్ రద్దీలో ప్రపంచంలో 2వ స్థానంలో బెంగళూరు సిటీ.. హైదరాబాద్ పరిస్థితి ఏంటంటే..?

నటుడిగా స్టార్ డమ్ సంపాదించిన విజయ్ తమిళగ వెట్రి కజగం పార్టీ స్థాపించి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఈసీ దగ్గర కూడా టీవీకే పార్టీ రిజిస్టర్ అయ్యింది. అధికారమే లక్ష్యంగా విజయ్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా పార్టీ జెండా, గుర్తును ప్రకటించి జనాల్లోకి వెళ్తున్నారు. అయితే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా 2025, సెప్టెంబర్లో కరూర్ జిల్లాలో నిర్వహించిన సభతో విజయ్ దూకుడుకు బ్రేక్ పడింది. 

కరూర్ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది చనిపోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్దారు. విజయ్‎ను దగ్గరి నుంచి చూసేందుకు అతడి అభిమానులు, టీవీకే పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై సుప్రీం కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. కరూర్ తొక్కిసలాట కేసును ప్రస్తుతం సీబీఐ ఇంటరాగేట్ చేస్తోంది. విచారణలో భాగంగా ఇప్పటికే  రెండు సార్లు విజయ్‎ను సీబీఐ ప్రశ్నించింది.