- వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారి
కొడంగల్, వెలుగు: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట్‌లో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్’, ఎడ్యుకేషన్ హబ్ పనులను కలెక్టర్ దీపక్ తివారి బుధవారం పరిశీలించారు. ఇంజినీరింగ్, మెడికల్, నర్సింగ్, అగ్రికల్చర్ సహా వివిధ కాలేజీల నిర్మాణాలను తనిఖీ చేశారు. నాణ్యతలో రాజీపడకుండా నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. అనంతరం కొడంగల్ పట్టణంలోని శ్రీమహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు.
ఆలయ పునర్నిర్మాణం, విస్తరణకు స్థానిక ప్రజలు సహకరించి ఇండ్లను ఖాళీ చేయాలని కోరారు. కాడా కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కాడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్, కమిషనర్ బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

