అమృత్‌‌‌‌ 2.0 ప్రాజెక్టు పైపుల దొంగల ముఠా అరెస్ట్

అమృత్‌‌‌‌ 2.0 ప్రాజెక్టు పైపుల దొంగల ముఠా అరెస్ట్
  • డీసీఎం, రూ.40 లక్షల విలువైన పైపులు రికవరీ

పరిగి, వెలుగు: అమృత్‌‌‌‌ 2.0 ప్రాజెక్టు పైపుల దొంగల ముఠాను పట్టుకుని రిమాండ్‌‌‌‌కు తరలించినట్లు వికారాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ తెలిపారు. ఆదివారం పరిగి పోలీస్ స్టేషన్‌‌‌‌లో నిర్వహించిన ఆయన కేసు వివరాలను వెల్లడించారు. పరిగి పట్టణంలోని న్యూ బ్రిలియంట్ స్కూల్ ఖాళీ స్థలంలో గత నెల 6న నిల్వ ఉంచిన 150 ఎంఎం డీఎల్‌‌‌‌ 232 పైపుల్లో 115 పైపులు చోరీకి గురయ్యాయి. వీటి విలువ సుమారు రూ.13 లక్షలు ఉటుంది. 

అమృత్‌‌‌‌ 2.0 ప్రాజెక్ట్ మేనేజర్ మంగపట్నం శ్రీనివాస్ ఫిర్యాదుతో పరిగి ఎస్సై మోహన్ కృష్ణ కేసు నమోదు చేయగా దర్యాప్తును సీఐ శ్రీనివాస్ రెడ్డికి అప్పగించారు. ఏడుగురు దొంగలు పైపులను అపహరించినట్లు గుర్తించి హైదరాబాద్​లో పలుచోట్ల అమ్ముకున్నట్లు గుర్తించారు. ఈ ముఠా 2025 నవంబర్‌‌‌‌లో వికారాబాద్ జిల్లా ఎన్నెపల్లిలో 82 పైపులు, డిసెంబర్ 10న వికారాబాద్ పట్టణం దాటిన తర్వాత చాయ్ హౌజ్, బాక్స్ క్రికెట్ గ్రౌండ్ సమీపంలో 20 పైపులు, డిసెంబర్ 18న నల్గొండ జిల్లా హాలియాలో నాగార్జున సాగర్ రోడ్డులో 17 పైపులు డీసీఎం సహాయంతో దొంగతనం చేసినట్లు వెల్లడించారు. 

ముఠా సభ్యులు జి.రాంబాబు, వి.శ్రీను, పి.అప్పలరాజు, జి.సహదేవ్, జి.మధుకర్ రెడ్డి, సిహెచ్ సురేశ్​ను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. మరో దొంగ సంతోష్ పరారీలో ఉన్నాడు. కేసును ఛేదించిన పరిగి పోలీసులను జిల్లా ఎస్పీ స్నేహా మెహ్ర అభినందించారు.