చవితి రోజు సక్సెస్ : ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్

చవితి రోజు సక్సెస్ : ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్

చంద్రయాన్ 2 అద్భుత జర్నీలో ఇస్రో మరో కీలకమైన విజయం సాధించింది. స్పేస్ క్రాఫ్ట్ నుంచి విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా విడిపోయింది. ఈ మధ్యాహ్నం ఒంటి గంటా 15 నిమిషాలకు ఆర్బిటార్ నుంచి… చంద్రయాన్ 2 విక్రమ్ ల్యాండర్ వేరయ్యింది. ఆర్బిటార్ నిర్ణీత కక్ష్యలో తిరుగుతుండగా… విక్రమ్ ల్యాండర్.. చంద్రుడికి దగ్గరగా వెళ్తోంది. సెప్టెంబర్ 7వ తేదీన విక్రమ్ ల్యాండర్ ను చంద్రుడిపైకి దించే అత్యంత కీలకమైన దశ మొదలుకానుంది.

రాకెట్ నుంచి శాటిలైట్ విడిపోయినట్టుగా.. 50 మిల్లీ సెకన్ల తక్కువ టైమ్ లోనే ఆర్బిటార్ నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోయింది. చంద్రయాన్ 2 స్పేస్ క్రాఫ్ట్ నిర్దేశిత ఎత్తుకు చేరాక ఇస్రో కమాండ్ సెంటర్ నుంచి విక్రమ్ సెపరేషన్ కు ఆదేశాలిచ్చింది. చంద్రయాన్ 2లోని సిస్టమ్స్​ ద్వారా తనంతట తానే విక్రమ్ వేరుపడింది. ఆర్బిటర్ కు పట్టి ఉంచిన బోల్టులు ఊడిపోవడం ద్వారా విక్రమ్ సెపరేట్ అయింది.  బోల్టులు ఊడిపోవడానికి పైరోటెక్నిక్ బోల్ట్ కట్టర్ ను ఇస్రో సైంటిస్టులు వాడారు.

తర్వాతేంటి?

విక్రమ్ ల్యాండర్ పనితీరును మిషన్ కంట్రోల్ సెంటర్ సైంటిస్టులు పరీక్షిస్తున్నారు.  4 న.. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య విక్రమ్ ను ఆర్బిట్ నుంచి తప్పిస్తారు. ఇది 6.5 సెకన్లలో పూర్తవుతుంది. ఆ తర్వాత విక్రమ్ ను పూర్తిగా ల్యాండింగ్ మోడ్ లోకి తీసుకొస్తారు. 109X120 కిలోమీటర్ల నుంచి.. ల్యాండర్ 35X97 కిలోమీటర్ల కక్ష్యలోకి రాగానే దాని పనితీరును మరోసారి  పరిశీలిస్తారు. సెప్టెంబర్ 7న అర్ధరాత్రి 1.30 నుం చి 2.30 గంటల మధ్య విక్రమ్ ను చందమామపైన దింపే కార్యక్రమాన్ని మొదలు పెడతారు.