అడవినే ఐసోలేషన్ సెంటర్‌గా మార్చుకున్న గ్రామస్తులు

అడవినే ఐసోలేషన్ సెంటర్‌గా మార్చుకున్న గ్రామస్తులు

క‌రోనా దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. ఎక్కడ చూసినా కరోనా కేసులు, కరోనా మరణాలే. కరోనా సోకితే మ‌ర‌ణం త‌ప్ప‌ద‌నే భ‌యంతో చాలామంది ఆవేదన పడుతున్నారు. కరోనా నుంచి కోలుకోవాలంటే మొద‌ట మాన‌సికంగా బ‌లంగా ఉండాలి.  స్వ‌చ్చ‌మైన వాతావ‌ర‌ణంలో ఉంటూ.. పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. అలాంటప్పుడే పేషంట్లు త్వరగా కోలుకుంటారు. అంతేకాకుండా కరోనా పేషంట్లకు కుటుంబసభ్యులు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి. కరోనా సోకిందనే ఆలోచనే రాకుండా.. పేషంట్లను ఎప్పుడూ అలర్ట్‌గా ఉంచాలి. 

అయితే చాలామంది పేషంట్లు తమకు వచ్చిన కరోనా ఇంట్లో వాళ్లకు కూడా సోకుతుందనే భయంతో.. ఐసోలేషన్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. మొన్నామద్య ఓ యువకుడు చెట్టుపైన ఐసోలేషన్ ఏర్పాటుచేసుకోగా.. మరో యువకుడు గ్రామ పంచాయతీ ఆఫీసును ఐసోలేషన్ సెంటర్‌గా మార్చుకున్నాడు. ఇలా తమకు అందుబాటులో ఉన్నవాటిలో తమకు తోచినట్లుగా ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటుచేసుకొని తమ వారు కరోనా బారినపడకుండా చూసుకుంటున్నారు. తాజాగా జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలో కూడా కొన్ని కుటుంబాలు ఊరికి దూరంగా ఐసోలేషన్ సెంటర్లని ఏర్పాటు చేసుకున్నాయి. య‌త్నారం అనే అట‌వీగ్రామంలో మూడు రోజుల వ్య‌వ‌ధిలోనే 34 మంది క‌రోనా బారిన ప‌డ్డారు.  దాంతో త‌మ వ‌ల్ల గ్రామంలోని మిగ‌తా వారికి క‌రోనా ఎక్క‌డ సోకుతుందనే భ‌యంతో ఏడు కుటుంబాల‌కు చెందిన 20 మంది క‌రోనా బాధితులు అడ‌విని ఐసోలేష‌న్ కేంద్రంగా మార్చుకున్నారు.  అడ‌విలో ఉంటూ.. అక్క‌డే వంట చేసుకుంటూ కాలం గ‌డుపుతున్నారు.  పూర్తిగా కోలుకున్న త‌రువాతే తిరిగి గ్రామంలోకి వెళ్తామ‌ని బాధితులు చెబుతున్నారు.