- కర్నాటకలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ ఇక్కడెందుకు చేయదు ?
- మేం అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తం
హనుమకొండ/ పరకాల/ యాదాద్రి, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం మజ్లిస్కు భయపడే సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్నాటకతో పాటు మహారాష్ట్రలోనూ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తుంటే ఇక్కడ ఎందుకు చేయరని ప్రశ్నించారు.
బుధవారం హనుమకొండ జిల్లా పరకాల అమరధామం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన మీటింగ్ లో మాట్లాడారు. హైదరాబాద్ సంస్థాన్ని భారతదేశంలో కలిపేందుకు పరకాల ప్రాంత ఉద్యమకారులు మరిచిపోలేని పోరాటం చేశారని, 1947 సెప్టెంబర్ 2న రజాకార్లు పరకాల ప్రజలపై సాగించిన మారణకాండ జలియన్ వాలా భాగ్ ఉదంతాన్ని తలపించిందన్నారు.
మజ్లిస్ పార్టీ రజాకార్ వారసులదని, అలాంటి పార్టీకి బీఆర్ఎస్, కాంగ్రెస్ కొమ్ముకాస్తున్నాయని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని, ఈ పోరాటాలను పాఠ్యాంశాల్లో చేరుస్తామని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 17 ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియజేయాలని, ఆ రోజున ప్రతి ఒక్కరూ త్రివర్ణ పతకాన్ని ఎగురవేసి, వందేమాతరం, జనగణమన పాడాలని కోరారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీజేపీ వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షులు గంటా రవికుమార్, కొలను సంతోష్ రెడ్డి, నాయకులు ప్రేమేందర్ రెడ్డి, రావు పద్మరెడ్డి, కొండేటి శ్రీధర్, మార్తినేని ధర్మారావు, రాణీ రుద్రమ, కీర్తి రెడ్డి పాల్గొన్నారు.
రేవంత్ సర్కారుకు రోజులు దగ్గర పడ్డయ్
కాంగ్రెస్ దౌర్జన్యాలను, కక్ష సాధింపు చర్యలను ప్రజలు ఎంతో కాలం సహించబోరని, రేవంత్ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయని రామచందర్ రావు అన్నారు. బుధవారం భువనగిరిలో పార్టీ కేడర్‌తో భేటీ అయ్యారు. కేసులు ఎదుర్కొని బెయిల్ పై బయటకొచ్చిన స్థానిక బీజేపీ కార్యకర్తలను పరామర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఆఫీసుల మీద, కార్యకర్తల మీద కాంగ్రెస్నాయకులు దాడులు చేస్తున్నారని, నల్గొండ జిల్లా అధ్యక్షుడి ఇంట్లోకి చొరబడి ఆయన తల్లిపై దాడి చేయడం రౌడీయిజానికి పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల ఆరాధ్యదైవం సంత్ రవిదాస్ చిత్రపటంపై నల్లరంగు పూయడం దారుణమన్నారు.
