ఏపీలో వైభవంగా వినాయక చవితి బ్రహ్మోత్సవాలు

ఏపీలో వైభవంగా వినాయక చవితి బ్రహ్మోత్సవాలు

ఆంధ్రప్రదేశ్  చిత్తూరు జిల్లా కాణిపాకంలో వినాయక చవితి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. కరోనా నిబంధనలతో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తరపున చిత్తూరు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు, అధికారులు మంత్రికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. 

 శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో ఇవాల్టి నుంచి ఈ నెల 30 వ తేది వరకు 21 రోజులు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కరోనా నిబంధనలతో భక్తులకు మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ స్వామి వారి దర్శనం కల్పిస్తున్నారు. 

ఉత్సవాలకు ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారని చెప్తున్నారు దేవస్థానం నిర్వాహకులు. ఉత్సవాల సమయంలో వీఐపీలకు స్పెషల్ దర్శనం రద్దు చేశారు. 21 రోజులు పాటు జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో గ్రామోత్సవం రద్దు చేసి ప్రధాన ఆలయంలో ప్రకారారోత్సవం నిర్వహిస్తున్నారు.  గణేశ్ దీక్ష స్వీకరించిన భక్తులు శ్రీమణికంటేశ్వర స్వామి వారి ఆలయంలో మాలధారణ విరమించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు.