ఆగమ శాస్త్రం ప్రకారమే రాజన్న ఆలయ అభివృద్ధి: రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

ఆగమ శాస్త్రం ప్రకారమే రాజన్న ఆలయ అభివృద్ధి: రాష్ట్ర  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
  • ఆలయ మాస్టర్ ప్లాన్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్

వేములవాడ, వెలుగు: ఆగమశాస్త్రం ప్రకారమే ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేపడతామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం వేములవాడ ఆలయ ప్రాంగణంలో రాజన్న టెంపుల్ అభివృద్ధి, విస్తరణపై  పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. ఇందులో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్, దేవాదాయ శాఖ కమిషనర్ వెంకటరావు, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు. ఆర్కిటెక్ట్  సూర్య నారాయణ మూర్తి ఆలయ విస్తరణ, అభివృద్ధి ప్రణాళికపై ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 

అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడారు. భవిష్యత్ లో పెరిగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ విస్తరణ అభివృద్ధికి  డీజీపీఎస్, డ్రోన్ సర్వే చేయించామని పేర్కొన్నారు. చారిత్రక ప్రాధాన్యమున్న ఉప ఆలయాలు యధావిధిగా కొనసాగుతాయ న్నారు. ఆలయ అభివృద్ధి, విస్తరణ , పనులను ఆగమశాస్త్రం ప్రకారం చేపడతామన్నారు. శృంగేరి పీఠం అనుమతితో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రణాళిక తయారు చేశామన్నారు. 

ఆలయ విస్తరణ 4.6 ఎకరాల్లో ఉంటుందని, మాస్టర్ ప్లాన్ డెవల్ మెంట్ ఏరియా 33 ఎకరాల వరకు ఉంటుందన్నారు. రూ. 110 కోట్లకు టెండర్లు పిలిచామన్నారు. మొదటి విడత గా రూ. 76 కోట్లు, అన్నదాన సత్రం నిర్మాణానికి రూ. 35 కోట్లు కేటాయించామన్నా రు. ఆలయంలో అన్ని సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయన్నారు. అభివృద్ధి పనుల సమయంలో భీమేశ్వర ఆలయంలో భక్తులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. మీడియా పాయింట్, 6 బెడ్స్  ఆస్పత్రి ఉండేలా చూడాలని ఆర్కిటెక్ట్ కు ప్రభుత్వ విప్ సూచించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ సలహాదారు గోవింద్ హరి, ఆలయ ఇన్ చార్జ్ ఈఓ రాధాబాయి, వివిధ పార్టీల నేతలు, పట్టణ ప్రజలు, పురోహితులు  మీడియా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 


దర్గాను తీసివేయండి..బీజేపీ నేత 

రాజన్న ఆలయం అభివృద్ధికి తాము అడ్డుకాదని, ఆలయంలోని కోటి లింగాలను మరో చోట ప్రతిష్ట చేస్తామని చెబుతున్నట్టే ఆలయ ఆవరణలోని దర్గాను కూడ తీసివేయాలని బీజేపీ నేత ప్రతాప రామకృష్ణ కోరారు. దర్గాకు కూడా బయట స్థలం కేటాయించి ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఆలయం అభివృద్ధి అలస్యం కాకుండా పనులు స్పీడ్​గా చేయాలని కోరారు.