చెత్తతో నిండిపోతున్న వందే భారత్ రైళ్లు.. !

చెత్తతో నిండిపోతున్న వందే భారత్ రైళ్లు.. !

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు చెత్తతో నిండిపోతున్నాయి. అత్యాధునిక సదుపాయాలతో అందుబాటులోకి తెచ్చిన ఈ రైళ్లు చెత్త కుండీలను తలపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఓ ఫొటోను ఐఏఎస్ అవనీశ్ శరణ్ ట్విట్టర్ లో షేర్ చేశారు. వీ ది పీపుల్ క్యాప్షన్ తో పోస్ట్ చేసిన ఈ ఫొటోలో వాటర్ బాటిళ్లు, ఫుడ్ ప్యాకెట్లు, ప్లాస్టిక్ కవర్లు బోగిలో చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. స్వీపర్ వాటిని శుభ్రం చేసేందుకు సిద్ధమవుతున్న ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో చెత్త గురించి పోస్ట్ చేసిన ఫొటోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. మన దేశంలో అంతే.. కొందరికి బాధ్యత తెలియదు గానీ హక్కుల గురించి మాట్లాడతారని ఒకరు కామెంట్ చేశారు. ‘మెరుగైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కావాలని అడుగుతుంటాం. కానీ దేశంలోని ప్రజలకు వాటిని శుభ్రంగా ఉంచుకోవడం, జాగ్రత్తగా చూసుకోవడం తెలియదు’’ అని మరొకరు స్పందించారు. ఇది చాలా బాధాకరమని ఒకరంటే.. ట్రైన్ ఏదైనా ఇలాంటి సీన్ కామన్ అని ఇంకొకరు కామెంట్ పెట్టారు.