
‘రక్షా బంధన్’ వచ్చేసింది. రాఖీల అమ్మకాలతో వీధుల ముందు దుకాణాలు వెలిశాయి. అయితే.. 2 రూపాయలు ఖరీదు మాత్రమే ఉన్న రాఖీని 50 రూపాయలకు అమ్ముతూ కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్న విషయం తాజాగా బయటపడింది. ఒక వీడియో రాఖీలు కొనడానికి వెళ్లిన అక్కచెల్లెమ్మల కళ్లు తెరిపించింది. ఒక రాఖీ హోల్ సేలర్ ఈ విషయాన్ని బయటపెట్టడం ఇక్కడ పెద్ద ట్విస్ట్. 2 రూపాయల రాఖీని ఫ్యాన్సీ ప్యాకేజింగ్ చేసి 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలకు అమ్ముతున్న బాగోతం ఇది. ఆ కిటుకు ఏంటనేది కూడా ఈ వీడియోలో ఆ వ్యక్తి స్పష్టంగా పూసగుచ్చినట్లు వివరించాడు.
కస్టమర్లు ఇలా అమాయకంగా కొంటున్నారు కాబట్టే మన దేశంలో రక్షా బంధన్ వచ్చిన ప్రతిసారి 10 వేల కోట్లకు పైగా బిజినెస్ నడుస్తోందని ఒక నెటిజన్ అభిప్రాయపడ్డాడు. రాఖీలు కొని అన్నదమ్ములపై అభిమానాన్ని వ్యక్తం చేయడం మంచిదే కానీ ఖరీదైన రాఖీలు కొంటున్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆ రాఖీ అంత విలువకు తగినదో.. కాదో ఆలోచించి కొనాలని నెటిజన్లు సూచిస్తున్నారు. అన్నదమ్ములపై తోబుట్టువుల ప్రేమ, అభిమానం వెలకట్టలేనిదని.. అందువల్ల కట్టే రాఖీ ఖరీదైందే కానక్కర్లేదని నెటిజన్లు కొందరు అభిప్రాయపడ్డారు.
మన పండుగలన్నింటిలో తోబుట్టువులు ప్రేమానుబంధాలతో జరుపుకొనేది రాఖీ పండుగే. రాఖీ కట్టిన సోదరికి కలకాలం రక్షగా ఉంటానని సోదరుడు భరోసా ఇస్తాడు. శ్రావణ మాస పౌర్ణమి రోజున జరుపుకునే ఈ పండుగను దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో జరుపుకుంటుంటారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ పౌర్ణమినే జంధ్యాల పౌర్ణమిగా కూడా జరుపుకుంటారు. బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, వైశ్య, పద్మశాలీ తదితర కమ్యూనిటీలకు చెందిన వ్యక్తులు జంధ్యాలు ధరిస్తుంటారు. పాతవి ఉంటే వాటి స్థానంలో కొత్తవాటిని ధరిస్తుంటారు.
►ALSO READ | టమాట రేట్లపై కేంద్రం గుడ్ న్యూస్.. ఢిల్లీలో భారీగా సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటన.. హైదరాబాద్లో పరిస్థితేంటి..?
అన్నదమ్ముళ్ల కోసం అక్కా చెల్లెల్లు పుట్టింటికి ప్రయాణమయ్యారు. చదువులు, ఉద్యోగాలు, కుటుంబ బాధ్యతలకు కాస్త గ్యాప్ ఇచ్చి వివిధ ప్రాంతాల నుంచి సొంతూరు బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ పండుగ కళ సంతరించుకుంది. ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పుట్టింటికి వెళ్లడం వీలుకాని అక్కాచెల్లెళ్లు ఆర్టీసీ కార్గోలు, ఇతర కొరియర్ల ద్వారా అన్నదమ్ములకు రాఖీలు పంపించి, తమ అనుబంధాన్ని చాటుకుంటున్నారు.