
చేతులు కడుక్కోవడం ఎంత ఇంపార్టెంటో పెద్దలకు తెలుసు. మరి, పిల్లలకు..? చెప్పినా అర్థం చేసుకునే వయసు కాదది. అందుకే ఓ టీచర్,హ్యాండ్‌వాష్ వల్ల ఎంత లాభమో పిల్లలకు కొత్తగా చెప్పారు. కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో పిల్లల్లో కొంతైనా అవగాహన కల్పించేందుకు ఆమె చేసిన ప్రయోగం అందరి మన్ననలను అందుకుంటోంది. ఓ గిన్నెలో నీళ్లు తీసుకుని, అందులో పెప్పర్ (మిరియాల పొడి)ని యాడ్ చేసింది. దాన్నే కరోనా వైరస్‌గా పిల్లలను అనుకోమంది. ఓ చిన్నారిని ఆ వైరస్ ఉన్న నీళ్లలో పెట్టమంది. వైరస్ (పెప్పర్) అంటాక వేలును తీసుకెళ్లి సబ్బు నీళ్లలో ముంచమని చెప్పింది. ఇప్పుడు ఆ సబ్బున్న వేలును మళ్లీ వైరస్ ఉన్న నీళ్లలో పెట్టమని చెప్పింది. వెంటనే సబ్బున్న వేలికి దూరంగా వైరస్ వెళ్లిపోయింది. స్టూడెంట్లు ఆ ప్రయోగాన్ని చూసి ఆశ్చర్యపోయారు. సబ్బుతో చేతులు కడుక్కోవడం వల్ల వైరస్లు ఎంత దూరంగా పారిపోతాయో అర్థమైంది కదా అంటూ టీచర్ ప్రయోగాన్ని ముగించారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.