నువ్వు పులివైతే.. బోనులో పడేస్తా .. స్టూడెంట్‌కు  శాతవాహన వీసీ వార్నింగ్

నువ్వు పులివైతే.. బోనులో పడేస్తా .. స్టూడెంట్‌కు  శాతవాహన వీసీ వార్నింగ్

కరీంనగర్, వెలుగు: శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమేశ్​కుమార్ ఓ విద్యార్థిని బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరికె మహేశ్​ అనే విద్యార్థికి ఆయన వార్నింగ్​ ఇచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. ‘పిల్లి పాలు తాగుకుంటూ ఎవరూ చూడరనుకుంటుంది. నువ్వు ఎవరిని కలుస్తున్నావో,  ఏం రిప్రజెంటేషన్లు ఇస్తున్నావో నాకు తెలుసు.. హైదరాబాద్ స్థాయిలో నాకు పరిచయాలు ఉన్నాయి. నువ్వు టైగర్ అనుకుంటే, నిన్ను బోనులో ఎలా వేయాలో నాకు తెలుసు’ అంటూ హెచ్చరించడం వీడియోలో వినిపిస్తోంది. ఓ పోలీస్ అధికారి ఎదుటే ‘కరికె మహేశ్​ అని ఒక్క లైన్ కంప్లైంట్ రాస్తే నీ పని అయిపోతుంది’ అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

ఈ విషయంపై విద్యార్థి కరికె మహేశ్​ స్పందిస్తూ.. ప్రొఫెసర్ ఉమేశ్​ కుమార్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన సమయంలో ఆర్థిక అక్రమాలపై ఆరోపణలు వచ్చాయని,  వాటిపై విచారణకు ప్రొఫెసర్ జగన్నాథ స్వామి, ప్రొఫెసర్ వెంకటయ్యలతో కమిటీ ఏర్పాటు చేశారని చెప్పారు. ఆ కమిటీ నివేదికను బయటపెట్టి చర్యలు తీసుకోవాలని జనవరి 27న ఉన్నత విద్యామండలికి ఫిర్యాదు చేసినందుకే తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలను వీసీ ఉమేశ్​కుమార్ ఖండించారు. మహేశ్​కు మంచి భవిష్యత్తు కోసం పలు సూచనలు మాత్రమే చేశానని, బెదిరించేలా ఒక్క మాట కూడా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు.