IPL 2026: క్రికెట్ ప్రపంచంలో రికార్డులు సృష్టించాలన్నా, వాటిని తిరగరాయాలన్నా అది ఒక్క విరాట్ కోహ్లీకే సాధ్యం అవుతుంది. ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (IPL 2026) చరిత్రలో కింగ్ కోహ్లీ తన పేరిట మరో అరుదైన రికార్డును లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో ఒకే ఒక్క ఫ్రాంచైజీ (RCB) తరఫున 5,500 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ (PBKS), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో విరాట్ ఈ అద్భుత మైలురాయిని అందుకున్నాడు.
సిక్సర్‌తో రికార్డు:
ఈ మ్యాచ్‌కు ముందు ఓపెనర్‌గా 5,500 పరుగుల మార్కును అందుకోవడానికి కోహ్లీకి కేవలం 7 పరుగులు మాత్రమే అవసరం అయ్యాయి. పంజాబ్ కింగ్స్ బౌలర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన ఓవర్‌లో కళ్ళు చెదిరే సిక్సర్ బాది కింగ్ కోహ్లీ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. నిజానికి ఐపీఎల్ చరిత్రలో ఓపెనర్‌గా 5,500 కంటే ఎక్కువ రన్స్ చేసిన వారిలో శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ వంటి వారు ఉన్నప్పటికీ.. వారు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున ఆ పరుగులను సాధించారు. కానీ, కోహ్లీ మాత్రం ఫస్ట్ నుంచి కేవలం ఆర్‌సీబీ (RCB) తరఫునే ఆడి ఈ రికార్డు అందుకోవడం విశేషం.
500+ రన్స్ చేయడం 9వ సారి:
ఐపీఎల్‌లో ఒక సీజన్‌లో అత్యధిక సార్లు 500+ కంటే ఎక్కువ పరుగులు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరుపైనే ఉంది. ఐపీఎల్ 2026 సీజన్‌లోనూ 500 రన్స్ మార్కును దాటేసిన కోహ్లీ.. తన రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ ఇలా 500+ రన్స్ చేయడం ఇది 9వ సారి.
ఐపీఎల్‌లో500+ రన్స్ చేసిన బ్యాటర్లు:
* విరాట్ కోహ్లీ: 9 సార్లు
* డేవిడ్ వార్నర్: 7 సార్లు
* కేఎల్ రాహుల్: 7 సార్లు
* శిఖర్ ధావన్: 5 సార్లు
వరల్డ్ రికార్డుకు అడుగు దూరం!
కేవలం ఐపీఎల్ లోనే కాదు.. ఓవరాల్‌గా పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సార్లు 50+ (హాఫ్ సెంచరీ లేదా అంతకంటే ఎక్కువ) భాగస్వామ్యాల్లో (Partnerships) పాలుపంచుకున్న బ్యాటర్ల జాబితాలో కోహ్లీ నెంబర్1 స్థానానికి దూసుకెళ్లాడు. అలెక్స్ హేల్స్ రికార్డును కోహ్లీ సమం చేసేశాడు.
మెన్స్ టీ20లలో అత్యధిక 50+ భాగస్వామ్యాలు:
* అలెక్స్ హేల్స్ - 210
* విరాట్ కోహ్లీ - 210
* డేవిడ్ వార్నర్ - 200
* బాబర్ అజామ్ - 196
* క్రిస్ గేల్ - 191
ప్రస్తుతం కోహ్లీ ఉన్న ఫామ్ చూస్తుంటే.. ఈ టీ20 వరల్డ్ రికార్డును బద్దలు కొట్టి ఒంటరిగా నంబర్ 1 స్థానంలో నిలవడం పెద్ద కష్టమేమీ కాదు. కింగ్ విరాట్ కోహ్లీ సృష్టించిన ఈ రేర్ ఫీట్‌తో ఆర్‌సీబీ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
