
దూకుడే మంత్రంగా బరిలోకి
విరాట్ కోహ్లీ .. ఓ రన్ మెషీన్ . ఫార్మాట్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించడం అతనికి బ్యాట్‌తో పెట్టిన విద్య . ఛేజింగ్ లోనైతే ప్రత్యర్థి బౌలర్లను చీల్చిచెండాడటం అలవాటు. వన్డేల్లో అత్యంత వేగంగా పది వేల రన్స్ చేసిన పరుగుల వీరుడికి మరెన్నో రికార్డులు దాసోహమయ్యాయి. సచిన్ లేని జట్టును జీర్ణించుకోలేకపోయిన అభిమానులను తన బ్యాటింగ్ పవర్‌తో మరిపించివారికి మరో దేవుడయ్యా డు. కెరీర్‌లో ఇప్పటి దాకా రెండు వరల్డ్ కప్ లు ఆడిన విరాట్ ..ఈ సారి కెప్టెన్‌గా మహా సంగ్రామానికి వెళ్లబోతున్నాడు. ఆటగాడిగా ముద్దాడిన కప్ ను ఈసారి కెప్టెన్‌గా స్వదేశానికి తీసుకురావాలని అందరూ ఆశిస్తున్నారు.
ఇండియాకు రెండు వరల్డ్‌కప్‌లు అందించిన ఎంఎస్ ధోనీ నుంచి 2017 లో పరిమిత ఓవర్ల జట్టు పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లీ.. గతంలో ఏ ఇండియా కెప్టెన్‌కు సాధ్యం కానీ ఘనతలు సాధించాడు. స్వదేశంతో పాటు విదేశీ గడ్డపై సిరీస్‌లు గెలిపించాడు. ఇంట్లోనే పులులు అని ఇండియా టీమ్‌పై ఉన్న ముద్రను చెరిపేశాడు. స్వయంగా దూకుడుగా ఉంటూ యువ రక్తంతో నిండిన జట్టులో కరెంట్ నింపుతూ విజయాలు సాధిస్తూ వచ్చాడు. కెప్టెన్‌గా తొలిసారి వరల్డ్‌కప్‌లో జట్టును నడిపించనున్న విరాట్.. ఆటగాడిగా, నాయకుడిగా ఇంగ్లండ్‌లో సక్సెస్ కావడం టీమిండియాకు చాలా కీలకం. గత ఇంగ్లండ్ సిరీస్‌లో చెలరేగి ఆడిన విరాట్ మెగా టోర్నీలో కూడా ఫామ్‌ను కొనసాగించి, ధోనీ అండతో ఈసారి కప్పు తీసుకోస్తాడా లేదా చూడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విరాట్ కెరీర్ గ్రాఫ్‌పై ఓ లుక్కేద్దాం..
తిరుగులేని కెప్టెన్
కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి తిరుగులేని రికార్డు ఉంది. స్వదేశంతోపాటు, విదేశీ గడ్డపై అద్భుత విజయాలు సాధించి గతంలో మరే కెప్టెన్‌కు సాధ్యం కానీ రికార్డులను సాధించాడు. కోహ్లీ నాయకత్వంలో టీమిండియా ఇప్పటిదాకా ఆడిన 68 వన్డే మ్యాచ్‌ల్లో 49 విజయాలు సాధించింది. 2017–18 మధ్య వరుసగా ఏడు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో జట్టును విజేతగా నిలిపిన రికార్డు కోహ్లీ సొంతం. అంతేకాక వరుసగా తొమ్మిది వన్డేల్లో విజయాలు సాధించి మాజీ కెప్టెన్ ధోనీ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. సొంతగడ్డపై వరుసగా ఐదు వన్డే సిరీస్‌ల్లో జట్టును విజేతగా నిలిపిన ఏకైక కెప్టెన్ కోహ్లీనే. సారధిగా కోహ్లీకి అదిరిపోయే బ్యాటింగ్ రికార్డు కూడా ఉంది. అత్యంత వేగంగా 3000(49 ఇన్నింగ్స్) రన్స్ పూర్తి చేసిన వన్డే కెప్టెన్ కూడా విరాటే. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ను వారి గడ్డపై ఓడించి విదేశాల్లో మరే ఇండియన్ కెప్టెన్ సాధించని ఘనతను కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఛేజింగ్‌లో కింగ్..
ప్రపంచంలోని అత్యుత్తుమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడైన కోహ్లీ ఎవరూ ఊహించని వేగంతో పరుగులు చేస్తున్నాడు. బ్యాట్స్‌మన్‌గా ఇప్పటికే ఎన్నో రికార్డులు అలవోకగా బద్దలుకొట్టిన విరాట్ ఛేజింగ్‌లో అయితే పెద్దపులిని తలపిస్తాడు. ఇప్పటిదాకా వన్డే కెరీర్‌లో కోహ్లీ సాధించిన పరుగులు10,843. ఇందులో 6617 రన్స్ ఛేజింగ్‌లో సాధించినవే, కోహ్లీ 41 వన్డే సెంచరీలు చేయగా అందులో 25 ఛేజింగ్‌లోనే రాబట్టాడు. ఈ గణంకాలు చూస్తే కోహ్లీని ‘ఛేజ్ మాస్టర్’ అని ఎందుకు అంటారో అర్థమైపోతుంది.
దూకుడే మంత్రం
ఇండియా క్రికెట్ చరిత్రలో కోహ్లీని మించిన దూకుడైన కెప్టెన్ మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ప్రత్యర్థికి ఆటతోనే సమాధానం చెప్పాలనేలా ఉండే ఇండియా జట్టుకు దూకుడుగా ఉండడం నేర్పించి గంగూలీ ఔరా అనిపిస్తే.. కెప్టెన్ కోహ్లీ స్వయంగా దూకుడుగా ఉంటూ జట్టులో మరింత జోష్ నింపుతూ భళా అనిపిస్తున్నాడు. ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ ఎక్కడైనా కోహ్లీది దూకుడు మంత్రమే. ‘మేము గీత దాటం.. వాళ్లు రెచ్చగొడితే బదులు చెప్పకుండా వదిలిపెట్టం’ గత ఆస్ట్రేలియా పర్యటనకు ముందు కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలు అతని స్టయిల్ ఏంటో చెబుతాయి. అంతేనా 2014 అడిలైడ్ టెస్ట్‌లో స్టీవ్ స్మిత్‌ను ‘నీ హద్దులో నువ్వు ఉండు’ అన్నా.. ‘ఇప్పటికే నీ బౌలింగ్‌లో నా జీవితానికి సరిపడా కొట్టేశా.. వెళ్లి బౌలింగ్ చెయ్’ అని జేమ్స్ ఫాల్క్‌నర్‌ను హెచ్చరించినా అది విరాట్‌కే చెల్లుతుంది. ఎస్‌జీ బంతుల నాణ్యతపై బహిరంగంగా మాట్లాడి తీవ్ర చర్చను రేపాడు. మరే ఇండియా కెప్టెన్ ఈస్థాయిలో దూకుడునైతే చూపిన దాఖలాలు లేవు.
ధోనీ లేకపోతే ?
నిజానికి మాజీ కెప్టెన్ ధోనీ.. విరాట్‌కు వెన్నెముకలా అండగా ఉంటాడు. బౌలర్లు మార్పు, ఫీల్డ్ ఛేంజ్స్ అంశాల్లో చాలా సలహాలిస్తుంటాడు. మ్యాచ్‌లో కీలక సమయాల్లో కోహ్లీ ఔట్ ఫీల్డ్‌లో ఫీల్డింగ్‌కు వెళ్లిపోతే ధోనీ జట్టును నడిపించి గెలిపిస్తుంటాడు. దీంతో ధోనీ లేకపోతే కోహ్లీ లేడనే అపప్రద ఏర్పడింది. ఒకవేళ మహీ జట్టుకు దూరమైతే విరాట్ కెప్టెన్‌గా ఏమేరకు రాణిస్తాడు అనే చర్చ కూడా కొంతకాలంగా జరుగుతుంది. అయితే ఇలాంటి వాటి అన్నింటికీ బదులు చెప్పేందుకు విరాట్‌కు ప్రపంచకప్ కంటే గొప్ప వేదిక మరోకటి దొరకదు.
ఇంగ్లండ్ లో జోరు
2014 ఇంగ్లండ్ టూర్ కోహ్లీకి పీడకల లాంటిది. ఈ టూర్‌లో కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. 10 ఇన్నింగ్స్ ల్లో 13సగటుతో 134 రన్స్ మాత్రమే చేశాడు. నాలుగేళ్ల తర్వాత 2018లో మళ్లీ ఇంగ్లండ్ వెళ్లిన విరాట్ ఈసారి ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. 2014 నాటి జట్టు లో ఉన్న బౌలర్లే 2018 సిరీస్ లోదాదాపు ఉండగా వారందరికీ చుక్కలు చూపించి లెక్క సరిచేశాడు. ఆ సిరీస్ లోఏకంగా 544 రన్స్ సాధించాడు. ఇప్పుడు వరల్డ్‌కప్ కు వేదిక ఇంగ్లండ్ కాబట్టి కోహ్లీ నాటి ఫామ్ ను కొనసాగిస్తాడని జట్టు తోపాటు అభిమానులు అతనిపై అంచనాలు పెట్టు కున్నారు. వాటన్నింటినీ కోహ్లీ నెరవేరుస్తాడో లేదో మరికొద్ది రోజుల్లో తేలనుంది.
కోహ్లీ చాలా అగ్రెసివ్ ప్లే యర్ .నేను అతనికి వీరాభిమానిని .అతనిలోని బ్యాట్స్ మన్‌తోపాటుదూకుడు నాకు నచ్చుతుంది. అతనుఆస్ట్రేలియా పై ఆడే తీరుకు నేనైతే ఫిదాఅయిపోయా. విరాట్ చాలా స్పెషల్. – వెస్టిండీస్ లెజెండ్ వివ్ రిచర్డ్స్