
న్యూఢిల్లీ: ఇండియాకు రెండో టీ20 ప్రపంచకప్ అందిస్తే ఎంతో గొప్పగా ఉంటుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. మాజీ సారథి ఎంఎస్ ధోనీ తర్వాత ఈ ఘనత అందుకున్న రెండో సారథిగా తన గౌరవం పెరుగుతుందని చెప్పాడు. ప్రస్తుతం వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే వరల్డ్ టీ20పై ఎక్కువగా దృష్టిపెట్టామన్నాడు. ‘2007 ఆరంభ ఎడిషన్ టీ20 కప్‌ను ఇండియా గెలిచింది. అప్పుడు ఈ ఫార్మాట్ గురించి పెద్దగా తెలియదు. భవిష్యత్ ఎలా ఉంటుందో కూడా అంచనాల్లేవు. కానీ ధనాధన్ క్రికెట్ ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతోంది. ఈ తరుణంలో రెండో టీ20 వరల్డ్‌కప్‌ను ఇండియాకు అందిస్తే చాలా గౌరవంగా ఉంటుంది. ఒకవేళ ఫిబ్రవరి 2020లో జరిగే మహిళల కప్‌ను టీమిండియా నెగ్గితే.. మేం మూడో కప్ కోసం పోరాడుతాం. ఏదేమైనా రాబోయే 12 నెలలు మాకు చాలా కీలకం. ఎందుకంటే ఆసీస్‌కు బలమైన టీమ్‌తో వెళ్లాలి. ఈ ఫార్మాట్‌కు ఎంపికైన కుర్రాళ్లందరూ నిరూపించుకోవాలనే పట్టుదలతో కసిగా ఆడుతున్నారు’ అని కోహ్లీ పేర్కొన్నాడు. ఆసీస్‌లో వచ్చే ఏడాది అక్టోబర్ 18 నుంచి టీ20 వరల్డ్‌కప్ జరుగనుంది. 2007లో ధోనీ టీ20 వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత ఐదుసార్లు ఈ మెగా టోర్నీ జరిగింది. కానీ ప్రతిసారి టీమిండియా రిక్త హస్తాలతోనే వెనక్కి వచ్చింది. 2016 టోర్నీలో కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికైనా.. ట్రోఫీని మాత్రం అందించలేకపోయాడు.