న్యూఢిల్లీ: తనలోని నేచురల్ టాలెంట్‌తోనే.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరల్డ్ క్లాస్ క్రికెటర్‌గా ఎదిగాడని సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. బాల్‌ను స్ట్రయిక్ చేసే విధానం, ఆటతీరు.. టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెడరర్‌ను తలపిస్తుంటాయన్నాడు. జింబాబ్వే మాజీ సీమర్ పొమ్మి మాంగ్వాతో జరిగిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో.. టాప్ క్లాస్ ప్లేయర్లయిన విరాట్, స్టీవ్ స్మిత్ గురించి అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఏబీ ఆసక్తికరంగా ఆన్సర్స్ ఇచ్చాడు. ‘ఇద్దరిలో ఫేవరెట్ ఎవరంటే చెప్పడం కష్టం. విరాట్‌లో దూకుడు ఎక్కువ. బాల్‌ను చాలా నేచురల్‌గా ఆడతాడు. ఓ రకంగా చెప్పాలంటే క్రికెట్ ఫెడరర్.. కోహ్లీ. ఇందులో ఎలాంటి సందేహం లేదు. స్మిత్.. నడాల్‌లాంటి వాడు. మెంటల్‌గా చాలా స్ట్రాంగ్. క్లిష్ట పరిస్థితుల్లో కూడా గంటల కొద్ది క్రీజులో పాతుకుపోతాడు. ఏదో రకంగా రన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కాకపోతే నేచురల్‌గా ఉండదు. క్రీజులో ఉంటే ఏదో రకంగా రికార్డులను కొల్లగొడతాడు. స్మిత్‌లాంటి మెంటల్లీ స్ట్రాంగ్ పర్సన్‌ను నేనిప్పటిదాకా చూడలేదు. కానీ విరాట్ అలాకాదు. వచ్చాడంటే ఒకటి, రెండు ఓవర్లలోనే మ్యాచ్‌ను తనవైపు తిప్పుకుంటాడు. ఏ షాట్ ఆడినా చాలా నేచురల్‌గా ఉంటుంది. ప్రతి ఓవర్‌లో ఏదో ఓ మ్యాజిక్ చేస్తాడు. వరల్డ్‌వైడ్‌గా అన్ని పిచ్‌లపై రన్స్ సాధించాడు. తీవ్ర ఒత్తిడిలోనూ మ్యాచ్‌లు గెలిపించాడు. అందుకే కోహ్లీ నా ఫేవరెట్’ అని డివిలియర్స్ వివరించాడు.
మాస్టరే.. గ్రేట్
వరల్డ్ క్రికెట్‌లో సచిన్ సాధించని ఘనతలు లేవని ఏబీ అన్నాడు. ఈ విషయంలో ఎవరితోనూ మాస్టర్‌ను పోల్చలేమన్నాడు. ‘కోహ్లీతో పాటు నాకూ సచినే రోల్ మోడల్. క్రికెట్‌లో మాస్టర్ ఎదిగిన తీరు అమోఘం, అద్భుతం. అతని ఫుట్‌వర్క్, బ్యాటింగ్, రికార్డులు, రన్స్.. ఇలా ప్రతి ఒక్కటి మా అందరికీ ఆదర్శం. విరాట్ కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటాడు. మేమందరం ఫాలో కావడానికి ఆటలో చాలా స్టాండర్డ్స్‌ను నెలకొల్పాడు. టెండూల్కర్ రికార్డులను బ్రేక్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ఏ ఫార్మాట్ అయినా, మ్యాచ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, పిచ్ ఎలా ఉన్నా.. బౌలర్ ఎవరైనా రన్స్ చేయడంలో సచిన్ దిట్ట. అయితే ఛేజింగ్ విషయంలో మాత్రం విరాటే కింగ్. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఛేజింగ్‌లో విరాట్‌లా ఆడే క్రికెటర్‌ను నా లైఫ్‌లో చూడలేదు. రికార్డులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఒత్తిడిలో మ్యాచ్ ఆడటం విరాట్‌కు చాలా సరదా. క్రీజులో అతను ఉన్నాడంటే ఎంత పెద్ద టార్గెట్ అయినా దిగదుడుపే. ఒత్తిడితో కూడిన ఛేజింగ్‌లో సచిన్ చాలాసార్లు విఫలమయ్యాడు’ అని ఈ సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ చెప్పుకొచ్చాడు.
లిటిల్ కోహ్లీ కోసం వెయిటింగ్..
క్రికెట్‌ను పక్కనబెడితే విరాట్‌తో తనకు చాలా క్లోజ్ బాండింగ్ ఉందని డివిలియర్స్ తెలిపా డు. ఫ్యామిలీ లైఫ్‌తో సహా చాలా విషయాలను అనుష్కతో కూడా షేర్ చేసుకుంటానన్నాడు. ‘అనుష్కతో చాలా విషయాలు మాట్లాడుతా. మా సంభాషణలు చాలా డీప్‌గా, ఫెంటాస్టిక్‌గా ఉంటాయి. పిల్లలు, ఫ్యామిలీ గురించి చర్చించుకుంటాం. లిటిల్ కోహ్లీ కోసం మేం కూడా వెయిట్ చేస్తున్నాం. క్రికెట్ కాకుండా 90 శాతం టైమ్‌ను ఇతర విషయాలను చర్చించడానికే కేటాయిస్తాం. ఈ విషయాలతోనే మేం రిఫ్రెష్ అవుతాం. ఐపీఎల్ టెన్షన్ నుంచి బయటపడేందుకు మాకున్న మార్గం అదే. ఐపీఎల్ అంటే ఓ టోర్నమెంటే కాదు.. ఫ్రెండ్‌షిప్ కూడా’ అని ఏబీ వ్యాఖ్యానించాడు.
