కోహ్లీ, బుమ్రాలకు విశ్రాంతి!

కోహ్లీ, బుమ్రాలకు విశ్రాంతి!

విండీస్‌‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌‌కు

సౌతాంప్టన్‌‌: గత కొంతకాలంగా బీజీ షెడ్యూల్‌‌తో గడుపుతున్న టీమిండియా కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ, స్పీడ్‌‌స్టర్‌‌ జస్‌‌ప్రీత్‌‌ బుమ్రాకు..  వెస్టిండీస్‌‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌‌లకు విశ్రాంతినిచ్చే అవకాశముంది.  గతంలో ఆసీస్‌‌తో జరిగిన సిరీస్‌‌ నుంచి విరాట్‌‌ ఇప్పటివరకు విరామం లేకుండా మ్యాచ్‌‌లు ఆడుతున్నాడు. దీంతో ప్రపంచకప్‌‌ ముగిశాకా.. ఆగస్టులో విండీస్‌‌తో  ప్రారంభమయ్యే టీ20, వన్డే సిరీస్‌‌కు విశ్రాంతి ఇవ్వాలని టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ భావిస్తున్నది. లిమిటెడ్‌‌ ఓవర్ల మ్యాచ్‌‌లు ముగిసిన తర్వాత ఆగస్టు 17 నుంచి జరిగే ప్రాక్టీస్‌‌ మ్యాచ్‌‌కు కోహ్లీ, బుమ్రా అందుబాటులో ఉండనున్నారు. ఈ మ్యాచ్‌‌ తర్వాత కరీబియన్లతో ‘టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌’లో భాగంగా జరిగే రెండు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో ఈ ఇద్దరు బరిలోకి దిగుతారు. దీనిని దృష్టిలో పెట్టుకుని విండీస్‌‌ టూర్‌‌ షెడ్యూల్‌‌లో కూడా బీసీసీఐ మార్పులు చేయించింది. వీరిద్దరి గైర్హాజరీతో వన్డే, టీ20 సిరీస్‌‌కు యువ క్రికెటర్లకు చాన్స్‌‌ ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఇండియా–ఎ తరఫున విండీస్‌‌లో పర్యటించిన మయాంక్‌‌, పృథ్వీ షా, విహారితో పాటు ధనాధన్‌‌ మ్యాచ్‌‌లకు క్రునాల్‌‌, శ్రేయస్‌‌, రాహుల్‌‌ చహర్‌‌, సంజూ శామ్సన్‌‌ను టీమ్‌‌లోకి తీసుకునే అవకాశం ఉంది.

కోహ్లీకి జరిమానా..

వరల్డ్‌‌కప్‌‌లో భాగంగా శనివారం అఫ్గానిస్థాన్‌‌తో జరిగిన మ్యాచ్‌‌లో దూకుడుగా అప్పీల్‌‌ చేసినందుకు ఇండియా కెప్టెన్‌‌ కోహ్లీకి జరిమానా విధించారు. మ్యాచ్‌‌ ఫీజులో 25 శాతం కోత వేశారు.  బుమ్రా వేసిన 29వ ఓవర్‌‌లో రహ్మత్‌‌ షా ఎల్బీ కోసం కోహ్లీ చాలా అగ్రెసివ్‌‌గా అప్పీల్‌‌ చేశాడు. దీనిపై విచారణ చేసిన రిఫరీ ఐసీసీ కోడ్‌‌ ఆఫ్‌‌ కండక్ట్‌‌లో లెవల్‌‌–1 రూల్‌‌ను ఉల్లంఘించినట్లు తేల్చారు. జరిమానాతో పాటు కోహ్లీ ఖాతాలో ఓ డీ మెరిట్‌‌ పాయింట్‌‌ను కూడా వేశారు.