T20 World Cup 2024: నువ్వేమైనా గిల్ క్రిస్ట్, హైడెన్ అనుకున్నావా.. బంగ్లా క్రికెటర్‌పై సెహ్వాగ్ ఫైర్

T20 World Cup 2024: నువ్వేమైనా గిల్ క్రిస్ట్, హైడెన్ అనుకున్నావా.. బంగ్లా క్రికెటర్‌పై సెహ్వాగ్ ఫైర్

వరల్డ్ కప్ లో భాగంగా సోమవారం (జూన్ 10) జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. లో స్కోరింగ్ థ్రిల్లర్ గా జరిగిన ఈ మ్యాచ్ లో నాలుగు పరుగుల తేడాతో సఫారీ జట్టు గెలిచి ఊపిరి పీల్చుకుంది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఛేజింగ్ లో తడబడింది. బ్యాటింగ్ చేయడానికి కష్టంగా ఉన్న పిచ్ పై బంగ్లా ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. ఈ లిస్టులో బంగ్లాదేశ్ సీనియర్ షకీబ్ అల్ హసన్ కూడా ఉన్నాడు. భాద్యతగా ఆడాల్సిన ఈ స్టార్ ప్లేయర్ నిర్లక్ష్యంగా తన వికెట్ ను పారేసుకున్నాడు. 

ఇన్నింగ్స్ 8వ ఓవర్లో సఫారీ పేసర్ నోకియా నాలుగో బంతిని షార్ట్ బాల్ వేసాడు. ఈ బంతిని పుల్ షాట్ ఆడదామని భావించిన షకీబ్ విఫలమయ్యాడు. అక్కడే ఉన్న ఫీల్డర్ మార్కరంకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. షకీబ్ ఆటతీరుపై ప్రస్తుతం విమర్శలు వస్తున్నాయి. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అయితే ఈ బంగ్లా ఆటగాడిపై దారుణంగా విరుచుకుపడ్డాడు. అనుభవం కోసం జట్టులో తీసుకుంటే షకీబ్ కొంచెం కూడా న్యాయం చేయడం లేదన్నాడు. 

కొంచెం సేపు కూడా క్రీజ్ లో నిలబడలేకపోయాడని.. షార్ట్ పిచ్ బాల్స్ ఆడడానికి అతను మాథ్యూ హెడెన్‌ లేదంటే ఆడం గిల్‌క్రిస్ట్‌ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సెహ్వాగ్ సెటైర్ విసిరాడు. నువ్వు కేవలం బంగ్లా ఆటగాడివని.. నీ ప్రమాణాలు నువ్వు తెలుసుకొని నీకు తెలిసిన షాట్స్ ఆడాలని షకీబ్ కు సెహ్వాగ్ సలహా ఇచ్చాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలుత  సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 113/6 స్కోరు మాత్రమే చేసింది. ఛేజింగ్‌‌‌‌లో ఓవర్లన్నీ ఆడిన బంగ్లా 109/7 స్కోరుకే పరిమితం అయింది.