సరిగ్గా రెండు నెలల క్రితం మే 7న ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విష వాయువులు లీక్ అయ్యి విశాఖను పెను విషాదంలోకి నెట్టేసింది. ఆర్ఆర్ వెంకటాపురం గ్రామానికి సమీపంలో ఉన్న ఎల్జీ ప్లాంట్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత స్టైరీన్ గ్యాస్ లీక్ కావడంతో వందల మంది తీవ్ర అస్వస్థతకు గురి కాగా, 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఎంక్వైరీ చేసేందుకు ప్రభుత్వం నాడు నియమించిన హై పవర్ కమిటీ సోమవారం సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి నివేదిక అందజేసింది. ఇందులో గ్యాస్ లీక్ ప్రమాదానికి కంపెనీ నిర్లక్ష్యమే కారణమని వెల్లడించింది. సరైన భద్రతా ప్రమాణాలను పాటించకపోవడంతో పాటు కనీసం అనూహ్యమైన ప్రమాదాలు జరిగినప్పుడు మోగాల్సిన సైరన్లు కూడా పని చేయకపోవడంతో భారీగా ప్రాణ నష్టం జరిగిందని కమిటీ వెల్లడించింది. ఈ కమిటీ నివేదిక అందిన 24 గంటల్లోనే ఎల్జీ పాలిమర్స్ సీఈవో సున్‌కీ జియాంగ్, డైరెక్టర్ డీఎస్ కిమ్, అడిషనల్ డైరెక్టర్ మోహన్ రావు సహా 12 మందిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. వారిపై ఐపీసీ 304(2), 278, 284, 285, 337, 338 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ సీఈవో, డైరెక్టర్లు సహా 12 మందిని అరెస్టు చేసినట్లు విశాఖ ఏసీపీ స్వరూపరాణి వెల్లడించారు.
Visakhapatnam Police arrests 12 people associated with LG Polymer Company management in connection with gas leakage incident which took place on May 7th that had claimed the lives of 12 people: Swaroopa Rani, Assistant Commissioner of Police (ACP), Visakhapatnam. #AndhraPradesh
— ANI (@ANI) July 7, 2020
